పెరుగుతున్న జనభా, పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కాలుష్య నివారణకు ధీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రణాళిలను రూపొందించాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. సోమవారం సనత్ నగర్ లోని పీసీబీ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణ- నివారణ, బయో మెడికల్ వేస్టెజ్, నిర్మాణ, కూల్చివేతల, హానికర, ఇ- వ్యర్ధాల నిర్వహణ- నిర్వీర్యం, ప్లాస్టిక్ బ్యాగుల నిషేదం, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, నదీ జలాల కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులతో చర్చించారు. ప్రధానంగా కోవిడ్ -19 బయో మెడికల్ వేస్టెజ్ నిర్వహణపై మంత్రి ఆరా తీశారు. ఆస్పత్రుల్లో జీవ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేస్తున్నారా? లేదా? అని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నిరంతరంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. ఏ ప్రాంతంనుంచి ఎంత పరిమాణంలో జీవ వ్యర్థాలు పోగవుతున్నాయి? ఎక్కడి నిర్మూలన ప్లాంటుకు ఎన్ని తరలించారన్న సమాచారం ఎప్పటికప్పుడు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తమ వెబ్ సైట్‌లో నమోదు చేయాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతిలో జీవ వ్యర్థాల నిర్వీర్య ప్రక్రియ కొనసాగాలని స్పష్టం చేశారు.
బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను పాటించని హాస్పిటల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తుందని, కాలుష్యకారక పరిశ్రమల పట్ల కఠినంగా వ్యవహరించాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. అధికారులంతా తరుచుగా పరిశ్రమలను తనిఖీ చేసి, ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. పారిశ్రామిక వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో పారబోస్తున్న కంపెనీలకు నోటీసులు జారీ చేసి, అప్పటికీ వాటి పనితీరు మారకపోతే లైసెన్స్ రెన్యువల్ చేయవద్దని సూచించారు. కాలుష్య నివారణలో పీసీబీ పాత్ర కీలకమని, కాలుష్యాన్ని అరికట్టడం వల్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినవారవుతారన్నారు. ఉద్యోగులందరూ బాధ్యతతో పని చేయాలని, నిబంధనలు ఉల్లఘించే సంస్థలు, వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని దిశానిర్ధేశం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ తో పాటు దాని చుట్టుపక్కల జిల్లాల్లో పారిశ్రామిక, జల, వాయు కాలుష్య నివారణకు నిర్దిష్టమైన ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. అన్ని రకాల కాలుష్య సమస్యలను అధిగమించేందుకు దీర్ఘకాలిక లక్ష్యంతో చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత వుందన్నారు. ఎన్జీటీ, ఆర్.ఆర్.సీ ఆదేశాలకు అనుగుణంగా నదుల కాలుష్యాన్ని నివారించడం కోసం పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం హరితహార కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ పెద్ద ఎత్తున మొక్కలు నాటడం వల్ల పచ్చదనం పెరిగిందన్నారు. మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు, వాతావరణంలో కాలుష్య నియంత్రణకు చెట్లు ఎంతో ముఖ్యమనే దానిపై ప్రజల్లో విస్తృత అవగాహాన కల్పించాల్సిన బాధ్యత పీసీబీ అధికారులపై ఉందన్నారు.
పర్యావరణాన్ని కాపాడేలా ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలను కాల్చి వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భారీగా జరిమానాలను విధించాలన్నారు.పర్యావరణానికి పెద్ద పీట వేస్తూ రాష్ట్రంలో 50 మైక్రాన్‌ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లను నిషేధించడం జరిగిందని, నిషేధం అమలను పూర్తిగా పర్యవేక్షించాలన్నారు.
ఈ సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి నీతూ కుమారి ప్రసాద్, సీఈ విశ్వనాధం, జేసీఈ సీవై.నగేష్, జేసీఇఎస్ సత్యనారాయణ, జోనల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.తమ ప్రాంతంలో ఉన్న వాయు నాణ్యత సూచికను తెలుసుకునేందుకు పీసీబీ రూపొందించిన టీఎస్ ఏయిర్ (TSAIR APP) ప్రత్యేక మొబైల్ యాప్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. అండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే, ఐవోఎస్ యూజర్లు యాప్ స్టోర్ నుండి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఈ మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తమ ప్రాంతంలో ఉన్న రియల్ టైమ్ అంబియెంట్ వాయు నాణ్యత సూచిని తెలుసుకోవచ్చని పీసీబీ అధికారులు తెలిపారు. ఫోటోలను అప్ లోడ్ చేయడంతో పాటు ఫిర్యాదు కూడా చేయవచ్చని చెప్పారు.