ఆస్తి-ప్రాణ నష్టం జరగకుండా చర్యలు: సీఎం కేసీఆర్

136
cm kcr
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు, మరో మూడు నాలుగు రోజుల పాటు భారీ, అతి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని, ఎక్కడికక్కడ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి 24 గంటల పాటు నిరంతరాయంగా పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.

సహాయక చర్యలు చేపట్టడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడవద్దని, అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నాయని సిఎం వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి ప్రతీ రోజు నివేదిక తెప్పించుకుని, పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు.ప్రకృత వైపరీత్యం తలెత్తినా సరే ఎక్కడా ఏమాత్రం అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, విద్యుత్ డిమాండ్ లో భారీ వ్యత్యాసం వచ్చినా గ్రిడ్ ఫెయిల్ కాకుండా సమర్థవంతంగా వ్యవహరించిన వ్యవసాయ శాఖను, హైదరాబాద్ తో పాటు ఇతర నగరాల్లో పెద్ద కష్టం, భారీ నష్టం కలగకుండా చర్యలు తీసుకున్న మున్సిపల్ శాఖను ముఖ్యమంత్రి అభినందించారు.

రాష్ట్రంలో వానలు, వరదలు, వాటి వల్ల తలెత్తిన పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, రెవెన్యూ, జల వనరులు, విద్యుత్, మున్సిపల్, పంచాయతీ రాజ్, వ్యవసాయం, రహదారులు – భవనాలు తదితర శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు వరదల ఉధృతి ఎక్కువున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితిని సిఎం ప్రత్యేకంగా సమీక్షించారు.

‘‘గడిచిన నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువులు నిండాయి. అన్ని జలాశయాల్లో నీరు వస్తున్నది. నదులు, వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఇప్పటి వరకు పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ రాబోయే మూడు నాలుగు రోజులు కూడా చాలా ముఖ్యం. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్ గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం, అల్పపీడనానికి అనుబంధంగా 5.8 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వల్ల భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి. దీనికి తోడు ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఈనెల 19 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరో వైపు గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ప్రాణహిత, ఇంద్రావతి నదులకు నీరందించే క్యాచ్ మెంట్ ఏరియా కలిగిన ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ అన్ని కారణాల వల్ల రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడి, భారీగా వరదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి, రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను అంచనా వేసి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి కోరారు.
‘‘రాష్ట్రంలో దాదాపు అన్ని చెరువులు నిండి, అలుగు పోస్తున్నాయి. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టిన ఫలితంగా చెరువు కట్టలు పటిష్టంగా తయారయ్యాయి. గతంలో ఇలాంటి వర్షాలు వస్తే వేల సంఖ్యలో చెరువు కట్టలు తెగేవి. బుంగలు పడేవి. కానీ మిషన్ కాకతీయ వల్ల చెరువుల నిల్వ సామర్థ్యం పెరిగింది. కట్టలు పటిష్టం అయ్యాయి. మిషన్ కాకతీయలో చేపట్టని కొన్ని చిన్న పాటి కుంటలకు మాత్రమే నష్టం వాటిల్లింది. అయితే రాబోయే రోజుల్లో ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్నందున, చెరువులకు వరద నీరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ప్రతీ చెరువునూ ప్రతీ నిత్యం గమనిస్తూనే ఉండాలి’’ అని సిఎం ఆదేశించారు.

సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ముఖ్య విషయాలు:

  • ఎంత విపత్తు వచ్చినా సరే ప్రాణనష్టం జరగవద్దనేదే ప్రభుత్వ లక్ష్యం. ఇతరత్రా నష్టాలు సంభవిస్తే ఏదోలా పూడ్చుకునే అవకాశం ఉంది. కానీ, ప్రాణాలు తిరిగి తేలేము. కాబట్టి విపత్తు నిర్వహణలో ప్రాణాలు కాపాడడమే అత్యంత ప్రధానమనే విషయాన్ని అధికార యంత్రాంగం గుర్తించాలి. దానికి అనుగుణంగా పనిచేయాలి. ప్రజలు కూడా వాతావరణం బాగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఇబ్బంది కలిగినా, ముంపు ప్రమాదం ఉన్నా వెంటనే అధికార యంత్రాంగానికి సమాచారం అందించాలి. కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఇండ్లలో ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు. కాజ్ వేల వద్ద వరద నీరు రోడ్లపైకి వస్తున్నది. అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు నీటి ప్రవాహానికి ఎదురెళ్లి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు.

-గోదావరి నదికి భారీ వరద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏటూరు నాగారం, మంగపేట మండలాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే ముంపు గ్రామాలను, ప్రాంతాలను గుర్తించాలి. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.

-గోదావరికి భారీ వరద వస్తే భద్రాచలం పట్టణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి భద్రాచలం పట్టణంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఉండాలి.

-నీటి ముంపు పొంచి ఉన్న ప్రాంతాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలి. ఈ శిబిరాల్లో అందరికీ కావాల్సిన వసతి, భోజనం ఏర్పాటు చేయాలి. కోవిడ్ నుంచి రక్షణ కోసం మాస్కులు, శానిటైజర్లు అందించాలి.

-మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఎక్కడికక్కడే ఉండి తమ ప్రాంతాల్లో సహాయ చర్యలను పర్యవేక్షించాలి.
రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లా కేంద్రాలలో కంట్రోల్ రూములు 24 గంటల పాటు నిరంతరాయంగా నడవాలి. ఎక్కడి నుంచి ఏ ఫోన్ కాల్ వచ్చినా స్వీకరించి, తక్షణం సహాయం అందించాలి. కంట్రోల్ రూముల్లో రెవెన్యూ, పోలీస్, జల వనరుల శాఖ, విద్యుత్ శాఖ తదితర ముఖ్యమైన శాఖల ప్రతినిధులుండాలి.మంత్రులు మహమూద్ అలీ, కె.టి రామారావు, నిరంజన్ రెడ్డి, ఈటెల రాజేందర్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ట్రాన్స్ కో – జెన్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు,సిఎంవో ముఖ్యకారదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శులు భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్, సిఎం ఓఎస్ డి శ్రీధర్ దేశ్ పాండే, డిజిపి మహేందర్ రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహా చారి, జి.ఎ.డి కార్యదర్శి వికాస్ రాజ్, మునిసిపల్ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, పంచాయతిరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జలవనరుల ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, పంచాయతి రాజ్ కమిషనర్ రఘునందన్ రావు, ఎంఎయుడి కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, డిసాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, హైదరాబాద్ కలెక్టర్ శ్వీతా మహంతి, జిహెచ్ ఎంసి కమిషనర్ లోకేశ్, టిఎస్ఎస్పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, ఇఎస్ సి మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -