ప్రతీ బీట్ యూనిట్ గా అడవుల పునరుద్దరణ…

265
haritha haram
- Advertisement -

జోరుగా కురుస్తున్న వర్షాలను ఆసరాగా చేసుకుని ఈ నెలాఖరు కల్లా ఆరవ విడత హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలని అన్ని జిల్లాల అటవీ అధికారులను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్. శోభ ఆదేశించారు. హరితహారం కొనసాగుతున్న తీరుపై అరణ్య భవన్ నుంచి పీసీసీఎఫ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరవ విడతలో జిల్లాల వారీ టార్గెట్లు, ఇప్పటిదాకా సాధించిన పురోగతిపై సమీక్షించారు.

ఈ ఏడాది హరితహారం మొత్తం లక్ష్యం 29.86 కోట్ల మొక్కలు కాగా, ఇప్పటిదాకా 21.06 కోట్ల మొక్కలు నాటినట్లు, మొత్తం లక్ష్యంలో ఇది 70.5 శాతమని హరితహారం ప్రత్యేక అధికారి ఆర్.ఎం. దోబ్రియల్ వెల్లడించారు. కామారెడ్డి, వరంగల్, మేడ్చల్ , భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాలు ఇప్పటికే లక్ష్యం మేరకు మొక్కలు నాటాయని తెలిపారు. వరంగల్ అర్బన్, నల్లగొండ, రంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలు మొక్కలు నాటడంలో వెనుకబడినందున కారణాలు ఆరాతీశారు. వర్షాలు ఎక్కువగా ఉండటం, వ్యవసాయ పనులు, కరోనా వైరస్, ఉపాధి కూలీల వంద రోజుల గడువు ముగియటం లాంటి కారణాల వల్ల ప్లాంటేషన్ కార్మికుల లభ్యత తగ్గిందని జిల్లాల అధికారులు వెల్లడించారు.

ఇక సహజ అడవి పునరుద్దరణ అత్యంత ప్రాధాన్యత అంశమని ఈ యేడాది 920 ఫారెస్ట్ బ్లాకుల్లో 2.10 లక్షల ఎకరాల అడవి పునరుద్దరణ లక్ష్యంగా పెట్టుకున్నామని పీసీసీఎఫ్ వెల్లడించారు. సాచురేషన్ పద్దతిలో రానున్న నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ బీట్ లో అడవుల పునరుద్దరణ జరగాలన్నారు. పల్లె ప్రకృతి వనాలు, పట్టణ వనాలు సహజ ఆక్సీజన్ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అటవీ శాఖ తరపున వీటి ఏర్పాటుకు పూర్తి సహకారం అందించాలని కోరారు. జాతీయ రహదారుల వెంట నర్సరీల ఏర్పాటు పురోగతిని సమీక్షించారు. ప్రత్యామ్నాయ అటవీ కరణతో పాటు, అన్ని రకాల ప్లాంటేషన్ పనులు ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే యేడాది హరితహారంతో పాటు, అటవీ పునరుద్దరణకు అవసరమైన మొక్కలు పెంచటం, నర్సరీల సంసిద్ధతపై దృష్టి పెట్టాలని జిల్లాల అధికారులకు సూచించారు. మూడు కోట్ల పెద్ద మొక్కలను పెంచటం లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు. కరోనా పరిస్థితి దృష్టిలో పెట్టుకుని పనుల పర్యవేక్షణ జరగాలన్నారు.

అర్బన్ పార్కుల పనుల పురోగతిపై కూడా సమీక్షించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.సమావేశంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, అదనపు పీసీసీఎఫ్ లు ఎం.సీ.పర్గెయిన్, సిద్దానంద్ కుక్రేటీ, చంద్రశేఖర్ రెడ్డి, సునీతా భగవత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -