సుప‌రిపాల‌న అందించ‌డ‌మే సీఎం కేసీఆర్ ల‌క్ష్యం

200
ktr
- Advertisement -

రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే ముఖ్యమంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు లక్ష్యమని, ఆ దిశగా ప‌రిపాల‌న వికేంద్రిక‌ర‌ణ చేశార‌ని పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుద్ధ భ‌వ‌న్ లోమంగ‌ళ‌వారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలపై అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితో కలిసి పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.

పురపాలక సంఘాల పరిధిలోని పట్టణాల్లో రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస అవసరాలపై ప్రధాన దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్‌.. ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీల‌లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నులు, చేప‌ట్టాల్సిన కార్య‌క్ర‌మాల‌పై కేటీఆర్ సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మున్సిపాలిటీల అభివృద్ధికి 42 అంశాలతో ఓ అభివృద్ధి నమూనాను తయారు చేశామన్నారు. దీని ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు.సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్ర‌తి ఒక్క‌రూ పని చేయాలన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పురపాలన కొనసాగాలని చెప్పారు. రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, ప‌చ్చ‌దనం వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. కొత్త పురపాలక చట్టం నిర్దేశించిన విధులను ఖ‌చ్చితంగా అమలు చేయాలన్నారు. ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి ల‌క్ష్యాల్లో భాగంగా హ‌రిత‌హారం కార్యాక్ర‌మంలో భాగంగా విరివిగా మొక్క‌లు నాటాల‌ని, గ్రీన్ బ‌డ్జెట్ లో 10% నిధుల‌ను ప‌చ్చ‌ద‌నం పెంపుకు కేటాయించి పార్కుల‌ను అభివృద్ది చేయాల‌ని, న‌ర్స‌రీల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు.

ప్ర‌తీ మున్సిపాలిటీలో వెజ్-నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మోడ‌ల్ మార్కెట్లను ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. వైకుంఠ‌ధామాల‌ను ఏర్పాటు చేసి అన్ని వ‌స‌తులు ఉండే విధంగా చూడాల‌న్నారు. స్పో్ర్ట్ప్ కాంపెక్స్ ల నిర్మాణం, జంతువుల సంర‌క్ష‌ణ కేంద్రం, బయోలాజికల్, బయో మెడికల్ వ్యర్ధాలు, కనస్ట్రక్షన్, డెమాలిష్ వెస్టేజ్ నిర్వహణ కూడా చేపట్టాలన్నారు. అలాగే మాంసం, కోళ్లు, చేపల అమ్మకం దార్లతో సమావేశం పెట్టి వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తగు చర్యలు తీసుకోవాల‌న్నారు.

శానిటరీ సిబ్బందికి ప్రతి నెల మొదటి వారంలోనే రూ. 12 వేల జీతం ఇవ్వాల్సిందేనన్నారు. వారికి అవసరమైన దుస్తులు, బూట్లు, మాస్క్‌లు మున్సిపాలిటీలు అందించాలన్నారు.అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి వెయి మందికి ఒక టాయిలెట్ ఉండేలా లక్ష్యంతో పని చేయాలన్నారు. ఇందులో 50 శాతం షీ టాయిలెట్లు ఉండాలన్నారు. ప్రతి మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ఉదయం 5.30 గంటలకే ఫీల్డ్‌లో ఉండాలని, స‌ర్ ఫ్రైజ్ విజ‌ట్ చేయాల‌ని మంత్రి కెటిఆర్ ఆదేశించారు.

చెత్త సేక‌ర‌ణ ప్ర‌తీ రోజు జ‌ర‌గాల‌ని, త‌డి, పొడి చెత్త‌ను విడిగా సేక‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. అవ‌స‌ర‌మున్న చోట రోడ్ల‌ను ఊడ్చే యంత్రాల‌ను కొనుగోలు చేయాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు.ఈ స‌మావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ వెంక‌టేష్ నేత‌, ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోణ‌ప్ప‌, దివాక‌ర్ రావు, దుర్గం చిన్న‌య్య‌, విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయ‌క్, పుర‌పాల‌క శాఖ ముఖ్య కార్య‌‌ద‌ర్శి అర్వింద్ కుమార్, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ డైరెక్ట‌ర్ స‌త్య‌నార‌య‌ణ‌, కలెక్టర్లు ముషారఫ్ అలీ ఫారూఖీ, సిక్తా ప‌ట్నాయ‌క్, భారతీ హోళికేరి, సందీప్ కుమార్ ఝా, మున్సిపల్ చైర్మన్ లు, పురపాలక శాఖ‌ కమిషనర్లు హాజరయ్యారు.

- Advertisement -