తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుండటంతో ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ఇకపై ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా ఆరు గంటల్లోగా ఫలితం తెలుసుకోవచ్చు. ఐసీఎంఆర్ కూడా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముందస్తుగా 50 వేల కిట్లను తెప్పించనున్నారు.
కరోనా నిర్ధారణ కోసం మన దేశంలో ప్రస్తుతం ఆర్‌టీ-పీసీఆర్, ట్రూనాట్, సీబీనాట్ టెస్టులు చేస్తున్నారు. శాంపిళ్ల సేకరణ, రవాణాకు రెండు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. ప్రయివేట్ హాస్పిటళ్లు, ల్యాబ్‌లు రూ.2200 వసూలు చేస్తున్నాయి.
ఆర్‌టీ పీసీఆర్ టెస్టుతో పోలిస్తే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు రిజల్ట్ వేగంగా రావడమే కాదు, ఖర్చు కూడా తక్కువ. రూ.500ల్లోపు ఖర్చుతో యాంటీజెన్ టెస్టు చేసే వీలుంది. యాంటీజెన్ టెస్టు కోసం సేకరించిన నమూనాలను గంటలోపే పరీక్షించాలి. ఈ టెస్టులు చేయడానికి సాధారణ లేబోరేటీలు సరిపోతాయి. దీంతో పీహెచ్‌సీల్లోనూ వీటిని చేసే వీలుంది. ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వస్తే మరోసారి కరోనా టెస్టు చేస్తారు.