పవిత్ర ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలను సర్వాంగ సుందరంగ ముస్తాబు చేస్తున్నారు. జనవరి 8, 9 తేదీలలో శ్రీవారి దర్శనం కోసం విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా…ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు.
ప్రతిఏటా సంప్రదాయ బద్దంగా నిర్వహించే ముక్కోటి ఏకాదశి వేడుకలను కన్నులారా వీక్షించేందుకు భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తుంటారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నారాయణగిరి ఉద్యానవనంలో 16 తాత్కాలిక షెడ్లు నిర్మించారు. క్యూలోని భక్తులపై ఎండ, వాన, మంచు పడకుండా రేకులు అమర్చారు. ఈదురు గాలుల నుంచి రక్షించుకునేందుకు వీలుగా పక్క భాగాల్లోనూ రేకులు అమర్చారు.
భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్ల వసతి కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతో పాటు భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. శ్రీవారి దర్శనం, గదులు, లడ్డూలు, లగేజీ కౌంటర్లు తదితర వివరాలను రేడియో, బ్రాడ్ కాస్టింగ్ విభాగం ద్వారా నిరంతరాయంగా భక్తులకు అందజేసేలా ఏర్పాట్లుచేస్తున్నారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలకంరణలు, పుష్పాలంకరణలతో అలంకరించనున్నారు.
ఇప్పటికే ఘాట్‌రోడ్డు పరిసరాలను శుభ్రం చేయించిన అధికారులు…అత్యావసర పరిస్థితుల్లో స్పందించేందుకు వీలుగా క్రేన్లు, సహాయక బృందాలను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తొలుత మొదటి, రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లలోని 54 కంపార్ట్మెంట్లలోకి భక్తులను అనుమతిస్తారు. అవి నిండిన తర్వాత తాత్కాలిక షెడ్లలోకి అనుమతిస్తారు. ముక్కోటి ఏకాదశి వేడుకలు విజయవంతం కావటానికి టీటీడీ… అధికారులతో ప్రత్యేక కమిటీలు నియమించింది.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు మరింత మెరుగైన దర్శనం, అన్నప్రసాదాలు, వసతి తదితర సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది. తగినంత లడ్డూలతో పాటు సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. నారాయణగిరి ఉద్యానవనాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే భక్తుల్లో భక్తిభావం పెంచేందుకు భజన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ధర్మప్రచార పరిషత్,దాససాహిత్య ప్రాజెక్టు భజన బృందాలతో పాటు శ్రీ సత్యసాయి సేవా సంస్థ, ఇస్కాన్ సంస్థల సేవలను వినియోగించుకోనుంది. భక్తులను గోవింద నామాలతో పాటు భజన కార్యక్రమాల్లో మమేకం చేయాలని టీటీడీ… సిబ్బందికి సూచించింది.