కవితక్క ‌చొరవతో స్వస్థలానికి ఆర్మూర్ వాసి..

333
Kalwakuntla Kavitha
- Advertisement -

ఉపాధి కోసం గల్ఫ్ దేశం సౌదీ అరేబియా వెళ్లిన ఓ నిరుపేద యువకుడు, అక్కడి యజమాని చేతిలో చిత్రవధకు గురయ్యాడు. తీవ్ర గాయాలతో రక్తమోడుతూ, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, కాపాడమంటూ అభ్యర్థించిన నిజామాబాద్ వ్యక్తి అంకమొల్ల రవికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చేయూతనిచ్చారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సహకారంతో సోమవారం నాడు రవి స్వగ్రామం చేరుకున్నాడు.

నిజామాబాద్ ‌జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన అంకమొల్ల రవి ఉపాధి నిమిత్తం ‌సౌదీ అరేబియా వలస వెళ్లాడు. అయితే ఎన్నో ఆశలతో సౌదీ అరేబియాలో అడుగుపెట్టిన రవికి అడుగడుగునా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. రవిపై యజమాని నిత్యం దాడి చేయడంతో తీవ్రంగా గాయాలపాలయ్యాడు.

అయితే యజమాని బారి నుండి రవిని కాపాడాల్సిందిగా కుటుంబ సభ్యులు, ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం నాయకులు కోటపాటి నరసింహ నాయుడును కోరారు. ఈ విషయాన్ని ఆయన మాజీ ఎంపీ ‌కవిత దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన మాజీ ఎంపీ ‌కవిత, సౌదీ అరేబియాలోని‌ భారత రాయబారి డా.ఔసాఫ్ సయీద్‌ను సంప్రదించారు. అంతేకాదు రవిని కాపాడేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర విదేశాంగ ‌మంత్రి జైశంకర్‌ను ట్విట్టర్ ద్వారా కోరారు.

మాజీ‌ ఎంపీ‌ కవిత సూచనలతో తెలంగాణ జాగృతి సౌదీ అధ్యక్షులు మౌజం అలీ ఇఫ్తెకార్, రవి యజమానితో, స్థానిక పోలీసులతో మాట్లాడారు. యజమాని దగ్గరి నుండి రవి వీసా ఇప్పించేలా చేసిన తెలంగాణ జాగృతి నాయకులు. ఈ నెల 2వ తేదీన రవిని యజమాని చెర నుంచి విడిపించి ఖొర్మ ప్రాంతంలో తాత్కాలిక ఆశ్రయం కల్పించారు.

అనంతరం ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, రవి హైదరాబాద్ వచ్చేందుకు విమాన టికెట్ ఏర్పాటు చేయించారు. ఈ నెల 14న రాత్రి హైదరాబాదు చేరుకున్న రవిని జాగృతి నాయకులు నిజామాబాదు జిల్లా లోని అతని స్వగ్రామం చేపూర్‌లోని ఇంటికి చేర్చారు. సౌదీలో తీవ్ర గాయాలవడంతో నిజామాబాదులో రవికి వైద్య పరీక్షలు చేయించారు.

మాజీ ఎంపీ కవిత సహకారం లేకపోతే, ఇంత త్వరగా ఆ నరకకూపం నుండి బయటపడే వాడిని కాదన్నారు బాధితుడు రవి. వెంటనే స్పందించి, సహకరించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు, రవి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రవి విషయంలో కవిత సూచన మేరకు సహకరించిన జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ నూర్ ఉర్ రహ్మాన్‌కు, వెల్ఫేర్ అధికారి డా. అలీంలకు జాగృతి బాధ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -