చెరువులను మత్య్ససహకార సంఘాలకే లీజుకివ్వాలి..

193
errabelli dayakar rao
- Advertisement -

గ్రామ పంచాయ‌తీల ప‌రిధిల్లోని చెరువులన్నింట‌నీ త‌ప్ప‌ని స‌రిగా ఆయా గ్రామాల మ‌త్స్య స‌హ‌కార సంఘాల‌కే లీజుకివ్వాల‌ని, ఈ మేర‌కు గ్రామ స‌ర్పంచ్ ల‌కు ఆదేశాలు జారీ చేయాల‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు బండా ప్ర‌కాశ్ విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు శ‌నివారం సాయంత్రం బండా ప్ర‌కాశ్ రాష్ట్ర పంచాయ‌తీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాకర్ రావు కి విన‌తి ప‌త్రం అంద‌చేశారు.

1964లో చేసిన కో ఆప‌రేటివ్ చ‌ట్టం కానీ, 1978లో రూపొందించిన 343 జీవో కానీ, 1999లో ఇచ్చిన 546 జీవో కానీ ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్న‌ద‌న్నారు. 100 ఎక‌రాల పై బ‌డిన‌, 100 ఎక‌రాలు లోబ‌డిన రెండు విభాగాలుగా చెరువుల‌ను విభ‌జించార‌ని బండా ప్ర‌కాశ్ చెప్పారు. అయితే, అప్ప‌టికే ఏర్ప‌డి ఉన్న మ‌త్స్య స‌హ‌కార సంఘాల‌కే 100 ఎక‌రాల లోపు ఉన్న చెరువుల‌ను లీజు కివ్వాల్సి ఉంద‌న్నారు. అయితే, సూర్యాపేట జిల్లా ఆత్మ‌కూరు (ఎస్) మండ‌లం నిమ్మిక‌ల్లు, ఖ‌మ్మం జిల్లా కూసుమంచి మండ‌లం కొదుమూరు, గ‌ట్టు సింగారం, ర‌ఘునాథ‌పాలెం, మ‌హ‌బూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండ‌లం మేచ‌రాజు ప‌ల్లి, మ‌రిపెడ మండ‌లం వీరారం, రాయ‌ప‌ర్తి మండ‌లం కొత్తూరు గ్రామాల్లో స‌ర్పంచ్ లు మ‌త్స్య‌స‌హ‌కార సంఘాల‌కు లీజుకివ్వ‌కుండా చెరువుల‌ను అట్టే పెట్టార‌న్నారు.

అలాగే స‌హ‌కార సంఘాల చ‌ట్టాల‌కు తూట్లు పొడుస్తున్నార‌న్నారు. ఓవైపు సిఎం కెసిఆర్, తెలంగాణ‌లో మ‌త్స్య సంప‌ద‌ను పెంచి, మ‌త్స్య కారుల‌ను ఆదుకోవాల‌ని నిర్ణ‌యించి, చెరువుల్లో కోట్లాది చేప పిల్ల‌ల‌ను వేసి ఆదుకుంటుంటే, మ‌రోవైపు కొంద‌రు స‌ర్పంచ్ లు ప్ర‌భుత్వం, సీఎం కెసిఆర్ ల‌క్ష్యాల‌కు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌న్నారు. ఆయా గ్రామాల స‌ర్పంచ్ ల వ‌ల్ల చ‌ట్టాలు అమ‌లు కాక‌పోవ‌డమే కాకుండా, ఆ గ్రామాల్లో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ద‌ని ఎంపీ బండ ప్ర‌కాశ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌య‌మై చ‌ట్టాన్ని ఉటంకిస్తూ, రాష్ట్రంలోని మొత్తం గ్రామ పంచాయ‌తీల‌కు ఆయా గ్రామాలలో ఉన్న మ‌త్స్య స‌హ‌కార సంఘాల‌కే లీజుకిచ్చేలా ఆదేశాలు జారీ చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

- Advertisement -