సిఎం కెసిఆర్ ఆదేశాలు… ముందే నిర్ణయించుకున్న మార్గదర్శకాలు, 7 ప్రాథమ అంశాలు, సమాయత్త సమావేశాలు, సమీక్షలు, జూన్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 8 రోజులపాటు నిరంతరాయంగా సాగిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతో చేసిన పర్యటనలు, ప్రత్యేక కార్యక్రమాలు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, ప్రజల్లోనూ ఉత్సాహాన్ని నింపాయి. చేసిన ప్రసంగాలు పల్లెల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిల అవసరాన్ని అర్థం చేశాయి. ప్రజల్ని చైతన్య పరిచాయి. దీంతో 80శాతానికి మించి పల్లె ప్రగతి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. పంచాయతీల్లో సమావేశాలు, గ్రామాల్లో పాదయాత్రలు, పారిశుద్ధ్యం, సురక్షిత మంచినీటి సరఫరా, దోమల నివారణ, ప్రభుత్వ, ఇతర ప్రాంతాల పరిశుభ్రత, చెత్త సేకరణ వంటి పలు అంశాల్లో పల్లె ప్రగతి ప్రత్యేక పారిశుద్ధ్యాన్ని నిర్వహించారు.
పల్లె ప్రగతిలో ప్రత్యేక పారిశుద్ధ్యంలో భాగంగా 12,766 గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు. ఈ కరోనా సమయంలోనూ నియంత్రిత పద్ధతిలో సామాజిక, భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరించి 1,75,485 మంది ప్రజలు ఆయా సమావేశాల్లో పాల్గొన్నారు. 12,752 గ్రామ పంచాయతీల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు కలిసి పాదయాత్రలు నిర్వహించి, సమస్యలు గుర్తించి, వాటిని నివారించారు. మురుగునీటి కాలువలను 81.26శాతం శుభ్రపరిచారు. సర్కారు తుమ్మ, పిచ్చి చెట్లను 76.54 శాతం నివారించారు. 70.37 శాతం సానిటేషన్ చేశారు. కాగా, 79.31శాతం మంచినీటి ట్యాంకులను క్లోరినేషన్ చేశారు. మంచినీటి సరఫరా చానెల్స్ ని 78.84శాతం పరిశుభ్ర పరిచారు. జూన్ 5వ తేదీన ఒక్క రోజే 88.16శాతం డ్రై డే ని పాటించడం జరిగింది. 80.78శాతం గ్రామాల్లో ఫాగింగ్ చేయడం జరిగింది. అంగన్ వాడీ కేంద్రాల్లో 81.21శాతం, ప్రాథమిక పాఠశాలల్లో 81.78శాతం, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 82.90శాతం, హై స్కూల్స్ లో 80.62శాతం పారిశుద్ధ్యం నిర్వహించారు.
సిఎం కెసిఆర్ ఆదేశంతో…రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విస్తృతంగా పర్యటించారు. మరోవైపు ముందే వీడియో కాన్ఫరెన్స్, టెలీ కాన్ఫరెన్సులతో అధికారులను అప్రమత్తం చేశారు. తన క్షేత్ర పర్యటనల ద్వారా ప్రజల్లో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని మంత్రి దయాకర్ రావు నింపారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీఎస్, స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. కరోనా కట్టడి నేపథ్యంలో కరోనా వైరస్, సీజనల్ వ్యాధుల నివారణకు ఊతంగా ప్రత్యేక పారిశుద్ధ్యం కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.ఈ సందర్భంగా పల్లె ప్రగతి, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.