వరంగల్ మరియు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లపై పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పరకాల ఎమ్మెల్యే ధర్మ రెడ్డి, కడియం శ్రీహరి, మరియు ఖమ్మం వరంగల్ జిల్లాల కలెక్టర్లు, కార్పొరేషన్ల కమిషనర్లు హాజరైయ్యారు. హైదరాబాద్‌లోని ఏసీ గార్డ్స్ లోని పురపాలక శాఖ కాంప్లెక్స్‌లో ఈ సమీక్ష సమావేశం జరిగింది.
కార్పొరేషన్లలో పౌరుల కనీస అవసరాల పైన ప్రధాన దృష్టి వహించాలని మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు హౌసింగ్ పైన ప్రధాన దృష్టి సాధించి ఎప్పటికప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పట్టణంలోని ఇతర మౌలిక వసతుల కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని జిల్లా మంత్రులకు కేటీఆర్ సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లోనూ ప్రాధాన్యత క్రమంలో ముఖ్యమైన కార్యక్రమాలను వెంటనే పూర్తయ్యేలా కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ల కమిషనర్లకు ఆదేశించారు.
ఇందు కోసం పురపాలక శాఖ తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్ల కమిషనర్లకు ఒకరోజు శిక్షణ సమావేశం ఏర్పటు చేస్తామని మంత్రి తెలిపారు. పట్టణాలను ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు ప్రాధాన్యతల గుర్తింపు పైన ఈ శిక్షణ సమావేశంలో నిపుణులు చర్చించనున్నారు.
వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని నియోజకవర్గాల వారీగా చేపట్టిన వివిధ కార్యక్రమాలను సమీక్షించిన మంత్రులు.మౌళిక వసతుల నిర్మాణ కార్యక్రమాల్లో కాంట్రాక్టర్ల అలసత్వం ఉంటే వాటిని ఇతర కాంట్రాక్టర్లకు అప్పజెప్పాలని సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి నిధుల కొరత లేకున్నా ఆలస్యం జరగడం పట్ల వర్కింగ్ ఏజెన్సీల తీరు పైన అసంతృప్తి వ్యక్తం చేశారు.
వరంగల్ ,ఖమ్మం పట్టణాల్లో రోడ్ల నిర్వహణతో పాటు, ఫుట్ పాత్ ల నిర్మాణం, గ్రీనరీ ఏర్పాటు, జంక్షన్ల అభివృద్ధి, టాయిలెట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న తాగునీటి సౌకర్యం, ప్రస్తుతం చేపడుతున్న తాగునీటి సంబంధిత మౌలిక వసతుల కార్యక్రమాలపై సమీక్షించారు మంత్రి కేటీఆర్.
విలీన గ్రామాల్లో నూతన మున్సిపాలిటీ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేయాలని మంత్రులు అధికారులకు సూచించారు.ఈనెల మూడవ వారంలో వరంగల్, ఖమ్మం పట్టణాల్లో మంత్రి కే తారకరామారావు స్వయంగా పర్యటించనున్నారు.