ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ: స్పీకర్ పోచారం

290
speaker pocharam
- Advertisement -

దేశంలోని మిగితా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. కామారెడ్డిలో మాట్లాడిన ఆయన తెలంగాణ రాష్ట్ర 6వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న యావత్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.‌

తెలంగాణ రాష్టం తెచ్చుకుంది అన్నీ వర్గాల సంక్షేమం కోసమేనన్నారు. దశాబ్ధాల పోరాటం, అమరవీరుల బలిదానాలు, కేసీఆర్ మడమతిప్పని పోరాట ఫలితమే కోట్లాది మంది తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కలను నెరవేర్చిందన్నారు.

దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం ఎలానో తెలంగాణ ప్రజలకు జూన్ 2 అవతరణ దినోత్సవం అలాంటిదే అన్నారు. రాష్ట్ర సాధన ఎంత ముఖ్యమో, రాష్ట్ర అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని…తెలంగాణ ప్రజలు కోరుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ది, సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ అమలు చేస్తున్నారు.

దేశంలోనే ఏ రాష్ట్రం చేపట్టని పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రక్తపాతం జరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ ది అన్నారు.

ఎన్నికల సమయంలో హామీ ఇవ్వని ఎన్నో పథకాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని…ప్రజలకోసం ఎవరైతే పని చేస్తారో అతడే నిజమైన నాయకుడన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక దిక్సూచిగా మారనుందన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీటిని అందించేందుకు పనులు జరుగుతున్నాయన్నారు.

- Advertisement -