ఆలేరు నియోజకవర్గానికి సాగునీటి అందించేందుకు గల ఆరు అవకాశాలను వినియోగించుకుని 8 మండలాలలకు సాగునీటిని అందించే లక్ష్యంగా ముందుకు పోతున్నామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తెలిపారు.
శనివారం యాదాద్రి భువనగరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని నియోజకవర్గ సాగునీటి లభ్యతను వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 15, 16 ఫ్యాకేజీలో భాగంగా నిర్మితమవుతున్న కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా బొమ్మలరామారం, తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు మండలాలకు సాగునీరు అందించే వీలుందన్నారు. ఆశ్వరావుపల్లి కాలువల ద్వారా ఆలేరు మండలంలోని 6 గ్రామాలకు, నవాబ్ రిజర్వాయర్ ద్వారా గుండాల మండలానికి సాగునీరు అందుతుందన్నారు.
ఆలేరు నియోజకవర్గానికి ఉన్న సాగునీటి సౌర్యాలన్నింటినీ వాడుకుని మొత్తం 699 చెరువులను నింపేందుకు ప్రణాళికలను తయారు చేస్తున్నామన్నారు. ఈ 699 చెరువుల స్థితిగతులు, చెరువులకు వెళ్లేందుకు ఉండాల్సిన ఫీడర్ చానళ్లను గుర్తించేందుకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో సర్వే జరుపుతున్నామన్నారు. చెరువుల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భూములను గుర్తించి వివరాలు ఇవ్వాలని ఆదేశించామన్నారు. నీటిని నింపేందుకు చెరువులకు కావాల్సిన సౌలభ్యం గుర్చి తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు, అనుభవజ్ఞులతో చర్చ జరుపుతున్నట్లు తెలిపారు.
ఆలేరు ప్రాంతానికి కాళేశ్వరం జలాలను అందిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నేపథ్యంలో చెరువులను పునరుద్దరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా పెంబర్తి చెరువులోకి నీటి వస్తే ఆలేరు ప్రాంతానికి నీటిని సమస్య తీరుందని పలువురు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారని తెలిపారు. కొన్ని చెరువుల్లోకి కాలువలను నిర్మాణం చేయాలని ప్రతిపాధనలు వచ్చాయని తెలిపారు. కొత్త కాలువల నిర్మాణం, ఇతర చెరువు డిజైయిన్ పనుల్లో కలుపుకుని త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులను పునురుద్దరిస్తామని చెప్పారు.ఇందుకు కావాల్సిన భూసేకరణ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు.
రాబోయే వర్షకాలంలోపు నీటిని అందిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీ మేరకు ఇందుకు సంబంధించి ముందస్తుగానే చెరువులను బాగుచేసుకునే విధంగా పనులు కొనసాగిస్తామని తెలిపారు. 8 మండలాలలోని చెరువులు, కాలువల నిర్మాణాలు పూర్తి చేసుకుని గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగించుకునేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బొమ్మలరామారం మండలంలోని చెరువుల స్థితిగతులపై సంబంధిత ఇరిగేషన్ అధికారులతో సమావేశం కానున్నట్లు ప్రభుత్వ విప్ తెలిపారు.