ట్రాఫిక్ రద్దీని నివారించుటకు నగరంలోని అంతర్గత రోడ్లను ప్రధాన రోడ్లకు అనుసంధానం చేసేందుకు లింక్, స్లిప్ రోడ్లను నిర్మిస్తున్నట్లు జి హెచ్ ఎం సి మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. శనివారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,హెచ్ ఆర్ డి సి ఎల్ చీఫ్ ఇంజనీర్ వసంత, సి సి పి దేవేందర్ రెడ్డి లతో కలిసి *-మల్కంచెరువు నుండి చిత్రపురి కాలనీ వరకు రూ 4 కోట్ల వ్యయంతో 500 మీటర్లు పొడవున నిర్మిస్తున్న లింక్ రోడ్ లో వున్న చిన్న చిన్న మతపరమైన నిర్మాణాలను తొలగించుటకు స్థానికులతో మాట్లాడి వప్పించారు.
లాంకో హిల్స్ నుండి అవుటర్ రింగ్ రోడ్ సర్వీసు రోడ్డు వరకు వరకు రూ 8 కోట్లతో నిర్మిస్తున్న 1.2 కిలోమీటర్లు లింక్ రోడ్ అలైన్మెంట్ ను పరిశీలించారు. భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడారు. స్థానిక శాసన సభ్యులు, రైతులతో మరోసారి సమావేశమై చర్చించనున్నట్లు తెలిపారు.
ఎన్జీవో కాలనీ నుండి ఎన్ ఐ ఎ బి ద్వారా గోపనపల్లి వరకు ప్రతిపాదిత లింక్ రోడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ లింక్ రోడ్ కు అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో హెచ్ ఎం డి ఎ డైరెక్టర్ శ్రీనివాస్, నార్సింగ్ మున్సిపల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.