ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వ వైద్య ఆరోగ్య సేవలను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. అందులో భాగంగానే నగరంలో పేద ప్రజలు ఎక్కువగా నివసించే మురికివాడలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకు అనుగుణంగా వైద్య ఆరోగ్యశాఖతో కలిసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారు సంయుక్తంగా బస్తీ దవాఖానాలను దశలవారిగా విస్తరించడం జరుగుతుంది. నగర పరిధిలో మురికివాడలలో నివసిస్తున్న పేద ప్రజలకు ప్రభుత్వ ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చి వారిపై ఆర్థిక భారాన్ని తగ్గించటమే ప్రభుత్వ సంకల్పం.
నగరంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కొంత దూరంలో ఉన్న ప్రాంతాలలో బస్తీ దవాఖానాల సేవలను అందించాలనే ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. దాదాపు 5వేల నుండి 10వేల జనాభాకు ఒక బస్తీ దవాఖానాను ఏర్పాటు చేయడం జరిగింది. 2018 ఏప్రిల్ 6వ తేదీన మల్కాజ్‌గిరి బి.జె.ఆర్ నగర్‌లో తొలి బస్తీ దవాఖానాను రాష్ట్ర ఐ.టి, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. నాటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు ఆ నాటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డా.సి లక్ష్మారెడ్డిలు కూడా పాల్గొన్నారు.
మొదటి దశలో 17 బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. 2019 ఏప్రిల్ నాటికి బస్తీ దవాఖానాల సంఖ్య 123కు పెరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మురికివాడ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు బస్తీ దవాఖానాల సంఖ్యను 300లకు పెంచాలని ప్రభుత్వం నిర్దేశించింది. తదనుగుణంగా ఈ నెల 22న మరో 45 బస్తీ దవాఖానాలను నగరంలో ప్రారంభించుటకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా నగర పరిధిలో హైదరాబాద్ జిల్లాలో 22, సంగారెడ్డిలో 03, రంగారెడ్డిలో 05, మల్కాజ్‌గిరిలో 15 బస్తీ దవాఖానాలు ఏర్పాటు అవుతున్నాయి. మిగిలిన 132 బస్తీ దవాఖానాలను రాబోయే మూడు నెలల్లో ఏర్పాటు చేయుటకు జిహెచ్‌ఎంసి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మురికివాడల్లో నివసిస్తున్న పేద ప్రజలకు బస్తీ దవాఖానాల ద్వారా అందుతున్న ఉచిత వైద్య సేవలు..
– ఓపి కన్సల్టేషన్
– టెలీ కన్సల్టేషన్
– బేసిక్ ల్యాబ్ పరిక్షలు
– ఉచిత మందులు
– సాధారణ జ్వరానికి చికిత్స
– వ్యాధి నిరోధక ఇమ్యునైజేషన్ సేవలు
– గర్బిణీలు, బాలింతల సంరక్షణ చర్యలు
– కుటుంబ నియంత్రణకు కౌన్సిలింగ్, వైద్య సేవలు
– రక్త హీనత పరిక్షలు
– బి.పి, బ్లడ్ షుగర్, క్యాన్సర్ తదితర ఆరోగ్య సమస్యలకు స్క్రీనింగ్
రోజువారిగా ఉచితంగా ప్రతి బస్తీ దవాఖానాలో అందిస్తున్న ఔట్ పేషంట్ సేవల వివరాలు:
– ప్రతిరోజు 80-90 మంది ఔట్ పేషంట్ సేవలను పొందుతున్నారు.
– 10-20 మంది సాదారణ జ్వరానికి వైద్య సేవలు పొందుతున్నారు.
– దగ్గు, జలుబుకు 10-20 మంది వైద్య సేవలు పొందుతున్నారు.
– చర్మ, ఒళ్లు నొప్పులు ఇతర రకాల అనారోగ్యానికి 50-60 మంది వైద్య సేవలు పొందుతున్నారు.
– ప్రతిరోజు దాదాపు 40-50 మంది వివిధ రకాల డయాగ్నస్టిక్స్ సేవలు పొందుతున్నారు.