అత్యున్నత న్యాయస్ధానం దేశ ఎన్నికలకు సంబంధించి కీలక తీర్పు ప్రకటించింది. ప్రజల మతపరమైన విషయాలతో రాజకీయాలను ముడిపెట్టొద్దని తెలిపింది. ఎన్నికల్లో ఏ పార్టీ కులం పేరుతో, మతం పేరుతో ఓట్లడగకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. అంతేకాదు ప్రాంతం పేరుతో, వర్గం పేరుతో ఓట్లడిగినా సహించేది లేదని హెచ్చరించింది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బి లోకుర్, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డె, జస్టిస్ ఎ.కె.గోయెల్, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు.
మరో మూడునెలల్లో జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఈ తీర్పు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విష్ణు జైన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనంలో ముగ్గురు జడ్జీలు వ్యతిరేకించగా నలుగురు జడ్జీలు పిటిషనర్‌వైపే మొగ్గు చూపారు.
భారతదేశంలో ఎన్నికల విధానం స్వేచ్ఛాయుతమైందని, వారికి నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే హక్కు ప్రజలకుందని కోర్టు తెలిపింది. అలాంటప్పుడు తన మతం వారికో, కులం వారికో వేయమని అడగడం సమంజసం కాదని రాజకీయ పార్టీలకు సుప్రీం సూచించింది.ఫిబ్రవరిలో ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలపై ఈ తీర్పు ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
హిందూత్వ కేసులో తీర్పును 1995లో అప్పటి సీజే జస్టిస్ జెఎస్ వర్మ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెలువరించింది. హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఓట్లు అడినందున శివసేన నేత మనోహర్ జోషితో పాటు బీజేపీ, శివసేనకు చెందిన మరికొందరి ఎన్నిక చెల్లదని బొంబాయి హైకోర్టు 1991లో ఇచ్చిన తీర్పును జస్టిస్ జెఎస్ వర్మ నేతృత్వంలోని బెంచ్ కొట్టివేసింది. హిందూత్వ/హిందూయిజం అన్నది ఉపఖండంలో ప్రజల జీవన విధానమని.. అదొక మనఃస్థితి అని మతం కాదని ఆ తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. హిందూత్వ పేరుతో ఓట్లు కోరడం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధం కాదని క్లారిటీ ఇచ్చింది.
ఇటీవలె నల్లధనంపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా నమోదైన 255 రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన సంగతి తెలిసిందే. 2005 నుంచి 2015 వరకు జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీలు పోటీచేయకపోవడంతో పాటు మనీ లాండరింగ్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయని భావించిన ఈసీ… 255 పార్టీల గుర్తింపును రద్దు చేస్తున్నట్టు తెలిపింది. గుర్తింపు రద్దు చేసిన రాజకీయ పార్టీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్నాటీడీపీ, ఎన్టీఆర్ టీడీపీ, జై తెలంగాణ వంటి 15 పార్టీలు ఉన్నాయి.