సూర్యాపేట ప్రజలు క్రమశిక్షణతోనే కరోనా కట్టడి..

200
- Advertisement -

సూర్యాపేట ప్రజలు పాటించిన క్రమశిక్షణ తోనే కరోనా మహమ్మారిని కట్టడి చేయగలిగామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.ప్రభుత్వం నిబంధనలు, వైద్యుల సలహాలను తూచా తప్పకుండా పాటించిన సూర్యాపేట ప్రజలు పట్టణంలో,గ్రామీణ ప్రాంతాల్లో వ్యాప్తి చెందకుండా కరోనాపై విజయం సాదించారన్నారు. సూర్యాపేట పట్టణంలో ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లకుండా ఉండేందుకు గాను జూనియర్ కాలేజ్, అఫ్జల్ రైస్ మిల్లుల వద్ద ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌లను మంత్రి ప్రారంభించారు.

అనంతరం జమ్మిగడ్డలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్‌లో తెలంగాణ సెక్యుర్డ్ డ్రైవర్స్ అసోసియేషన్‌కు చెందిన 400 మంది కార్ డ్రైవర్‌లకు మంత్రి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.వితరణ విషయంలో తెలంగాణ సమాజం ఎప్పుడూ వెనుకకు పోలేదన్న మంత్రి ఈ కరోనా ఆపత్కాల సమయంలో బీద ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సహాయానికి తోడుగా దాతలు, స్వచ్ఛంద సంస్థలు మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నాయని మంత్రి కొనియాడారు.ప్రజలు కూడా ప్రభుత్వ యంత్రాంగానికి ఇంతకాలం సహకరించిన విధంగానే సహకరించి కరోనా మహమ్మారిని పారాద్రోలడానికి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో భాగస్వామ్యం కావాలన్నారు.

Minister Jagadish Reddy on corona

ప్రజలు స్వీయ నిబంధన పాటించి,ప్రతీ క్షణం జాగ్రత్తగా ఉండాలన్నారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు నిర్లక్ష్యం వహించకుండా ప్రజలు అత్యంత జాగ్రత్త గా ఉండవల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి అన్నారు. ఖరీఫ్ సీజన్ రానున్న నేపద్యంలో వ్యవసాయ సంబంధిత విత్తన, ఎరువుల, మోటార్ వైండింగ్, యంత్రాల దుకాణాలు, తదితర దుకాణాలు తెరిచే ఉంటాయని మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి రైతాంగానికి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణమ్మ, కమీషనర్ రామనుజుల రెడ్డి, ఆర్డీవో మోహన్ రావ్, వైస్ ఛైర్మన్ పుట్టా కిషోర్, కౌన్సిలర్లు తాహెర్ పాషా, బాషా, నిమ్మల స్రవంతి శ్రీనివాస్, జానీ, ఆకుల లవకుశ, తెలంగాణ సెక్యూర్డ్ డ్రైవర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్, ఉప్పల ఆనంద్, కొండపల్లి దిలీప్ రెడ్డి, బైరు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -