వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి హామీ- మంత్రి

184
Errabelli Dayakar Review On Narega Works
- Advertisement -

ఆర్థిక మాంద్యం, మ‌రోవైపు క‌రోనా వైప‌రీత్యం…వేస‌వి కాలం… దృష్ట్యా వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి హామీ ప‌థ‌కం కింద ప‌నులు క‌ల్పించాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మాత్యులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్ని జిల్లాల అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. క‌రోనా నేప‌థ్యంలో ప‌నులు వెతుక్కుంటూ ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌కు వెళ్ళిన అనేక మంది తిరిగి వాళ్ళ ఊళ్ళ‌కు చేరార‌ని, అలాంటి వారు కోరుకుంటే వెంట‌నే జాబ్ కార్డులు జారీ చేసి, వారికి ప‌ని క‌ల్పించాల‌ని మంత్రి ఆదేశించారు. సాధ్య‌మైనంత ఎక్కువ మందికి ప‌నులు క‌ల్పించాల‌నేదే సీఎం కెసిఆర్ ల‌క్ష్య‌మ‌ని, అందుక‌నుగుణంగా అధికారులు క‌చ్చితంగా ప‌ని చేయాల‌ని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు, కూలీలకు ఉపాధి కల్పన, కరోనా, వేసవి నేపథ్యంలో కూలీల భద్రత, నర్సరీలు, మొక్కల పెంపకం, ఇంకుడు గుంతలు, వైకుంఠ దామాలు తదితర అంశాలపై రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లతో సోమ‌వారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ.. క‌రోనా క‌ష్ట కాలంలో నిరుపేద ప్ర‌జ‌ల‌ను ఆదుకోవాల‌నేదే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. సిఎం కెసిఆర్ కూడా పేద‌ల‌కు ప‌నులు క‌ల్పించాల‌ని ఆదేశించార‌ని చెప్పారు. అయితే, కూలీల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని, మాస్కులు అందించాల‌ని, సామాజిక‌, భౌతిక దూరం పాటించాల‌ని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని 12,486 గ్రామ పంచాయ‌తీల్లో 22 ల‌క్ష‌ల 78 వేల 059 మంది ఉపాధి కూలీలు పని కోసం నివేదించారని, ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి స‌గ‌టున 182 మంది కూలీలు ప‌ని చేస్తున్నారని మంత్రి తెలిపారు. గ‌త ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క‌రోనా ఉన్న‌ప్ప‌టికీ 45% ఉపాధి కూలీల‌ పెరుగుదల ఉందని మంత్రి చెప్పారు. 88శాతం కూలీల‌కు ఉపాధి ల‌భిస్తున్న‌ద‌ని అన్నారు. ఉపాధి హామీ ప‌నుల్లో టాప్‌లో సంగారెడ్డి, సూర్యపేట, కామారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలున్నాయ‌ని మంత్రి వివ‌రించారు.

రాష్ట్రంలో 12,738 గ్రామ పంచాయతీల‌లో నర్సరీలు ఏర్పాటు చేయ‌గా, అందులో 22.95కోట్ల మొక్క‌లు అందుబాటులో ఉన్నాయ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు. మొక్క‌ల మ‌నుగ‌డ 86% ఉంద‌ని మంత్రి చెప్పారు. ఈ వ‌ర్షాకాల సీజ‌న్‌లో నాట‌డానికి 14 కోట్ల 19ల‌క్ష‌ల 44వేల విత్త‌నాలు సిద్ధం చేశార‌న్నారు. 44.39 లక్షల ఇంకుడు గుంత‌ల ల‌క్ష్యం కాగా, 3.74 లక్షలు ఇంకుడు గుంత‌ల ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే, వ‌ర్షాకాల సీజ‌న్ మొద‌ల‌య్యే నాటికి వేగంగా ల‌క్ష్యం సాధించేలా ఇంకుడు గుంత‌ల ప‌నులు పూర్తి చేయాల‌ని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల‌ను ఆదేశించారు. 12,770 గ్రామ పంచాయతీలలో వైకుంఠ ధామాలు అవ‌స‌రం ఉండ‌గా అందులో 12,472 గ్రామ పంచాయ‌తీ లలో స్థ‌లాలు గుర్తించబడ్డాయి. ఇందులో 11,508 గ్రామాల‌లో పనులు చేపట్టారు. మొత్తం 90.1% పనులు చేపట్టారని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు.

ఈ కార్యక్రమంలో పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, స్పెష‌ల్ కమిషనర్ రఘునందన్ రావు, ఎంజిఎన్ఆర్ ఇజిఎస్ ప్ర‌త్యేకాధికారి సైదులు, ఇత‌ర శాఖ‌ల ఉన్న‌తాధికారులు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్లు ఈ వీడియో కాన్ఫ‌రెన్స్, స‌మీక్ష లో పాల్గొన్నారు.

- Advertisement -