కొత్త రాష్ట్రమైనా తెలంగాణ అతి కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు నాయకత్వంలో ‘ధాన్యాగారంగా’ మారబోతోందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం పౌరసరఫరాల భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014-15 రబీలో 1690 కొనుగోలు కేంద్రాల ద్వారా 2 లక్షల 54 వేల మంది రైతుల నుంచి 13.24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, గత ఏడాది 2018-19లో 3509 కొనుగోలు కేంద్రాల ద్వారా 6 లక్షల 78 వేల మంది రైతుల నుంచి 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ రబీలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందనే అంచనాతో 6500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఐదు సంవత్సరాల్లో ఒక్క యాసంగిలోనే 700 శాతం పైగా ధాన్యం కొనుగోళ్లు పెరగబోతున్నాయని తెలిపారు. గత ఏడాది యాసంగిలో ఇదే సమయానికి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5000 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ధాన్యం దిగుబడులను బట్టి ప్రాధాన్యత క్రమంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014-15లో ఖరీఫ్, రబీలో కలిపి 35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరిపంట సాగైంది. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమ చర్యలతో పంటలు బాగా పండాయి. ప్రాజెక్టులు, చెరువులు నిండి నీరు పుష్కలంగా అందడంతో రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి సారిగా ఒక్క రబీలోనే 40 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది.
తాలు, తేమ పేరుతో తరుగు తీస్తే కఠిన చర్యలు..
రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం. ఎవరూ ఆందోళన చెందొద్దు. తొందరపడొద్దు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని ఆరబెడితే గ్రామంలో ఉండే రైతు బంధు కోఆర్డినేటర్లు, వ్యవసాయ శాఖ అధికారులు పంట తేమ శాతం సరిగా ఉన్నదీ లేనిదీ నిర్ధారించి టోకెన్లు అందజేస్తారు. ఆ తరువాతనే రైతు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. ఈ విషయంలో రైతులు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో తేమ, తాలు పేరుతో ఇష్టానుసారం కోత విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రైస్ మిల్లర్లను హెచ్చరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సమస్య అధికంగా ఉందని, దీనిపై ప్రధానంగా దృష్టి సారించడం జరిగిందని, కలెక్టర్లు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని మా కమిషనర్ పి. సత్యనారాయణ రెడ్డి ఆదేశాలు జారీచేయడం జరిగింది. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని అన్నారు.
గన్నీ సంచులు..
రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అవుతుండడం, ఇదే సమయంలో లాక్ డౌన్ వల్ల గన్నీ సంచులు, హమాలీల కొరత ఏర్పడింది, దీని వల్ల రైతాంగానికి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. ఈ ఏడాది రబీలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కోసం 22 కోట్ల గన్నీ సంచులు అవసరం. లాక్ డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పశ్చిమ బంగాల్ నుంచి అనుకున్న సమయానికి కొత్త గన్నీ సంచులు రాకపోవడం,అలాగే పాత గన్నీ సంచుల రవాణాకు ఇబ్బందులు ఎదురవుతుండడం గన్నీల కొరత ఏర్పడింది.దీన్ని అధిగమించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం.
బీహార్ నుంచి హమాలీలు..
హమాలీల కొరతతో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి లోడింగ్, అన్ లోడింగ్‌కు సమస్యలు ఎదురవుతున్నాయి. ఎక్కువగా బీహార్ నుండి హమాలీలు వచ్చి ఇక్కడ పనిచేస్తారు. ప్రస్తుతం వారు కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో బీహార్ లో ఉన్నారు. ఇక్కడికి రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ బీహార్ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. వాళ్లు ఇక్కడికి రావడానికి కావాల్సిన చర్యలు చేపడుతున్నాం. రైస్ మిల్లర్ల బియ్యం రవాణాకు ఇబ్బంది కలగకుండా పోలీసులు సహకరించాలని, అదే విధంగా షిఫ్టుల పద్దతిలో హమాలీలు 24 గంటల పాటు మిల్లుల్లో పనిచేస్తున్నారని, వారి రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని పోలీసు శాఖకు విజ్ఞప్తిచేశారు.