తెలంగాణ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు కేబినెట్ కమిటీని నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం ఉపాధ్యక్షుడు అరిసనపల్లి జగన్మోహన్‌రావు హర్షం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్రీడా గ్రామాన్ని తెలంగాణలో నెలకొల్పేందుకు శీఘ్రంగా కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టు నూతన స్పోర్ట్స్ పాలసీ రూపకల్పనకు కూడా కేబినెట్ కమిటీ చొరవ తీసుకొని క్రీడల పురోభివృద్ధికి దోహదపడాలని విజ్ఞప్తి చేశారు.
స్పోర్ట్స్ పాలసీ తయారీలో రాష్ట్రంలోని ప్రముఖ క్రీడాకారులు, క్రీడా సంఘాలు, నిపుణులను కూడా భాగస్వామ్యులు చేయాలని సూచించారు. వరల్డ్ మిలటరీ గేమ్స్ తర్వాత హైదరాబాద్‌లో అంతటి పెద్ద క్రీడోత్సావాలు మళ్లీ జరగలేదని..తెలంగాణ గొప్పతనం, సామార్థ్యాన్ని ప్రపంచ పటంలో నిలిపేందుకు వచ్చే మూడేళ్లలో అలాంటి మెగా ఈవెంట్ ఒకటి నిర్వహించేందుకు కూడా కేబినెట్ కమిటీ చొరవ తీసుకోవాలని కోరారు. ఇందుకోసం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ నేతృత్వంలోని ఒలింపిక్ సంఘం, ఇతర క్రీడా సంఘాలు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉత్సుకతతో ఉన్నాయని జగన్మోహన్‌రావు తెలిపారు.