ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం సాగించేందుకు దేశ ప్రజలంతా ఏకతాటి మీద నిలవాలని, ఈ పోరాటంలో అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. వారి సతీమణి శ్రీమతి ఉషమ్మతో కలిసి ఇవాళ ఉపరాష్ట్రపతి నివాసంలో రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించి, కరోనాపై పోరును ముందుండి నడిపిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కరోనా మీద భారతీయులు చేస్తున్న పోరాటానికి మద్ధతుగా.. పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకూ తన వేతనంలో ప్రతి నెలా 30 శాతాన్ని విరాళంగా ప్రకటించారు.
కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు 130కోట్ల మంది భారతీయులు ఒకేతాటిపై ఉన్నారని చాటిచెప్పాలన్న ఉద్దేశంతో.. దేశ ప్రజలనుద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు ప్రజలందరూ స్పందించి.. విపత్కర పరిస్థితుల్లోనూ భారతీయులంతా ఐకమత్యంతో ఉన్నారనే తమ దృఢ సంకల్పాన్ని దీపాల వెలుగుల్లో ప్రదర్శించారని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.
కరోనా వైరస్ సవాల్‌కు వెరవకుండా.. భారతీయులంతా కలిసికట్టుగా ఈ మహమ్మారిపై పోరాటాన్ని కొనసాగిస్తున్నారన్నారు. కరోనా మహమ్మారి మీద పోరాటం ఓ ఎత్తైతే నిత్యం సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు వార్తలు అంతకు మించిన వైరస్ లాంటివని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారం గురించి స్పష్టంగా తెలుసుకుని మన మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఆ విషయాన్ని తెలియజేయాలని సూచించారు. కరోనా లాంటి మహమ్మారి బారిన పడ్డ వారు ఎవరైనా బాధితులే అని ఇలాంటి విపత్కర పరిస్థితులను సంకుచిత దృక్పథంతో చూడడం తగదని హితవు పలికారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని విధిగా పాటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
దీప ప్రజ్వలన మనుషులను అజ్ఞానం నుంచి జ్ఞానమార్గంలోకి.. చీకటి నుంచి వెలుగులోకి వెళ్లేందుకు మార్గదర్శనం చేస్తుందన్న ఉపరాష్ట్రపతి, కరోనా చీకట్లను పారద్రోలడంలో ఎవరూ ఒంటరిగా లేరనే విషయాన్ని దీపాలు వెలిగించడం ద్వారా ప్రజలు స్పష్టం చేశారన్నారు. ఇకపైన కూడా లాక్‌డౌన్ సమయంలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరాన్ని.. ప్రభుత్వం, వైద్య నిపుణులు సూచిస్తున్న ఇతర జాగ్రత్తలను పాటిస్తూ.. వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడంలో సహకరించాలని మరోసారి ఉపరాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు.
ఇలాంటి జాతీయ విపత్తు పరిస్థితుల్లో వలస కార్మికులు, పేదల ఆకలితీర్చడంతోపాటు వారికి నీడ కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తుచేశారు. కరోనా సంబంధిత వార్తలను ప్రజలకు అందజేసేందుకు శ్రమిస్తున్న జర్నలిస్టులను కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభినందించారు.