బాలకృష్ణ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. క్రిష్ దర్శకత్వం వహించిన సినిమా ఆడియో కార్యక్రమం తిరుపతిలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు అతిథులుగా తరలివచ్చారు. గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియో సీడీని చంద్రబాబు లాంఛ్ చేశారు. ఇదే వేదికపై ఎన్ బీకే నెవర్ బిఫోర్ బుక్ ను నటి హేమమాలిని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం చేయడం తన పూర్వ జన్మ సుకృతమని తెలిపారు. ‘పౌరుషం, విజ్ఞానం ఉంటే జీవితం సార్థకమవుతుందని అంటారు. మన తెలుగు రాజహంస గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ చిత్రం కోసం క్రిష్ చాలా కష్టపడ్డారు. తెలుగువారు గర్వపడే సినిమా చేశారు. నా 100వ చిత్రం కోసం ఎన్నో కథలు విన్నా. కొన్ని నచ్చాయి. కొన్ని నచ్చలేదు. ఏం చేయాలో తెలియని స్థితిలో క్రిష్ చెప్పిన కథ నచ్చింది. చిరంతన్ భట్ చక్కని స్వరాలు అందించారు. ఒక చిత్రంలో సాంగ్స్ హిట్ అయితే సగం విజయం సాధించినట్టే. సాయి మాధవ్ అద్భుతమైన మాటలు రాశారు. షూటింగ్ ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగింది. వాతావరణం కూడా మాకు అనుకూలించింది. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ అద్భుతమైన పాటలో నటించారని తెలిపారు.
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘ఆడియో విడుదలకు కేంద్రమంత్రి రావడం ఏమిటని అందరూ అనుకోవచ్చు. ఇప్పుడు నేను సినిమాలకు కూడా మంత్రిని. అందుకే వచ్చా. నాకు సినిమా వాళ్లు తెలుసు. వాళ్ల సత్తా తెలుసు. కానీ సినిమాల గురించి తెలియదు. కానీ ఈ సినిమా మన చరిత్రను గురించి తెలియజేయడం సంతోషం. సినిమా నేపథ్యమే నన్ను, చంద్రబాబునాయుడి గారికి ఈ కార్యక్రమానికి రప్పించింది’ అని పేర్కొన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం కూడా ‘లెజెండ్’లా 1000 రోజులు ఆడుతుంది. ఈ సినిమా కంటే అద్భుతమైన రాజధాని కట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. ప్రపంచ దేశాల్లోని గొప్ప రాజధానుల్లో ఒకదానిగా అమరావతిని తీర్చిదిద్దుతాం. రాజధానికి వాస్తుబలం బాగుంది. ఆ పేరుపెట్టుకుని రాజ్య పాలన చేసిన గౌతమిపుత్ర మీద తీస్తున్న ఈ చిత్రం కూడా వెయ్యి రోజులు కాదు.. అంతకన్నా ఎక్కువ ఆడుతుందన్నారు.
దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం కోసం మా నాపేరు ముందు మా అమ్మ పేరుతో అంజనా పుత్ర క్రిష్ అని పెట్టుకున్నా. ఆ పేరును నిలబెడతా. పెళ్లి అయిన తర్వాత పదిరోజులు కూడా నా భార్యతో ఉండలేదు. అందుకు ప్రతిగా గొప్ప చిత్రాన్ని ఇస్తానని చెబుతున్నా. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా అనుకొన్నప్పుడు పాఠ్యపుస్తకాల నుంచి సమాచారం సేకరించడం ప్రారంభించాం. ఎక్కడో పాశ్చాత్యుల వద్ద ఉన్న సమాచారం మనదగ్గర లేదు. బాలకృష్ణ ఈ కథను 10 నిమిషాల్లో ఒకేచేశారు. 14 గంటల్లో అనౌన్స్ చేశారు. అప్పటినుంచి ప్రణాళిక బద్ధంగా సినిమా తీశాం. గౌతమిపుత్ర లాంటివాడు గ్రీస్‌లో పుట్టి ఉంటే. 100 పుస్తకాలు రాసేవారు. 10 సినిమాలు తీసేవారు. మూడు ఆస్కార్లు వచ్చేవి. బాలకృష్ణ ఎంత సమయం అంటే అంత సమయం సెట్‌లో ఉండేవారు. అన్నీ తానై నడిపించారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు. సమయం లేదు మిత్రమా.. సంక్రాంతికి వస్తుంది. జై బాలయ్య.’ అంటూ ముగించారు.