ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన ఓ మత కార్యక్రమం ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిజాముద్దీన్ ప్రాంతంలోని ‘తబ్లిగి ఏ జమాత్’ మార్చి 1-15 మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి పలువురు హాజరయ్యారు. తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల నుంచి వందలమంది ఇందులో పాల్గొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా వీరిలో పలువురికి కరోనా వైరస్ సోకినట్టు ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ఇందులో తెలంగాణకు చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డారు.
ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో ఇవాళ ఒకేసారి 1600 మందిని క్వారెంటైన్‌కు తరలించారు. వీరిలో 11 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. 300 మంది వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారు.
నిజాముద్దీన్ దర్గా, చుట్టు పక్కల ప్రాంతంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు.. ఆ ప్రాంతాన్ని సీజ్ చేసి, ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి పై వాకబు చేశారు. దర్గాలో జరిగిన సమావేశంలో పాల్గొన్న వారందరినీ.. బస్సులలో క్వారెంటైన్‌కు తరలించారు. నిన్న 200 మంది, ఇవాళ 1400 మందిని క్వారెంటైన్ కు తరలించారు.