‘హిట్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత విష్వక్‌సేన్ హీరోగా నటిస్తుండగా, లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న ‘పాగల్’ చిత్రం షూటింగ్ గురువారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విష్వక్‌సేన్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో రానా దగ్గుబాటి క్లాప్ కొట్టగా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ అధినేత పి. కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా యూనిట్‌కు శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్ అధినేత దిల్ రాజు స్క్రిప్ట్ అందజేశారు. ఈ ప్రారంభ వేడుకలో చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై యూనిట్‌కు శుభాకాంక్షలు అందజేశారు.
అనంతరం హీరో విష్వక్‌సేన్ మాట్లాడుతూ.. దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించాననీ, ఇప్పటివరకూ తాను చేయని జానర్‌లో ‘పాగల్’ సినిమా ఉంటుందనీ అన్నారు. ఒక మంచి స్క్రిప్టుతో చేస్తున్న సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉందని సంగీత దర్శకుడు రథన్, సినిమాటోగ్రాఫర్ మణికందన్, ఎడిటర్ గ్యారీ, ప్రొడక్షన్ డిజైనర్ లతా తరుణ్ తెలిపారు.
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ విష్వక్‌తో ఈ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉందనీ, ఒక క్రేజీ సబ్జెక్టుతో ఈ సినిమా తీస్తున్నామనీ అన్నారు. మంచి ముహూర్తం కావడంతో ఈ రోజు లాంఛనంగా సినిమాని ప్రారంభించామనీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కబడ్డాక షెడ్యూళ్లను ప్లాన్ చేస్తామన్నారు. నరేష్ లాంటి ప్రతిభావంతుడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు హ్యాపీగా ఉందని చెప్పారు.
దర్శకుడు నరేష్ కుప్పిలి మాట్లాడుతూ విష్వక్‌సేన్ ఇప్పటివరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన స్క్రిప్టుతో ఈ సినిమా చేస్తున్నామని చెప్పారు. టైటిల్‌ని బట్టి ఇది యాక్షన్ సినిమానా అని అడుగుతున్నారనీ, లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందనీ తెలిపారు. ప్రేక్షకులకు కచ్చితంగా ఒక మంచి సినిమా చూశామనే తృప్తి ఈ సినిమా ఇస్తుందన్నారు.
సాంకేతిక బృందం:పాటలు: చంద్రబోస్,సంగీతం: రథన్,సినిమాటోగ్రఫీ: ఎస్. మణికందన్,ఎడిటింగ్: గ‌్యారీ బీహెచ్,ఆర్ట్: టి.కె. మోహన్,ఫైట్స్: విక్రమ్, దిలీప్ సుబ్బరాయన్,కొరియోగ్రఫీ: విజయ్,ప్రొడక్షన్ డిజైనర్: లతా తరుణ్,పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను,నిర్మాత: బెక్కెం వేణుగోపాల్,కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నరేష్ కుప్పిలి.