కరోన వ్యాప్తి నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా అన్ని ఆలయాలను శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి అల్లోల సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ.రమణా చారి, దేవాదాయ శాఖ కమిషర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.
కరోన వైరస్ ప్రబలకుండా ఆలయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్ధేశం చేశారు. జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైరస్ వేగంగా విస్తరిస్తుందన్న నేపథ్యంలో దర్శనం కోసం వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. కరోన వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు మైక్ ల ద్వారా అనౌన్స్ మెంట్ చేయాలన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఆలయాధికారులకు సర్క్యూలర్ జారీ చేశారు.
సర్క్యూలర్ లో పేర్కొన్న అంశాలు..
-యాంటీ బ్యాక్టీరియా లిక్విడ్ స్ప్రే ను అన్ని ప్రదేశాలలో స్ప్రే చేయాలి,భక్తుల వసతి గృహాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో పాటు శుభ్రంగా ఉంటే విధంగా చర్యలు తీసుకోవాలి,అలాగే దారిపొడుగున బ్లీచింగ్ చల్లాలి,అన్ని ప్రదేశాలలో ఫాగింగ్ మరియు సోడియం హైపోక్లోరైట్ తో వాష్ ఏర్పాటు చేయడంతో పాటు భక్తులు నడుచే క్యూలైన్లు అన్నింటి లోనూ ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
మైకుల ద్వారా అనౌన్స్ మెంట్..
దర్శనానికి వచ్చే భక్తులు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సుదూర ప్రాంతల నుండి వచ్చే భక్తులు వారి వారి ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవాలని కోరారు. ఒక వేళ దర్శనానికి వచ్చినచో తగిన జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలన్నారు. గత 28 రోజుల్లో విదేశాలను నుంచి వారు దర్శనానికి రావద్దని, వారి కుటుంబ సభ్యులను కూడా పంపవద్దని సూచిస్తున్నారు. కరోనా మహామ్మారి భారిన పడ్డ దేశాల నుంచి భారతదేశానికి వచ్చిన వారు ఆలయ ప్రాంగణంలోకి రావద్దని మైక్ లో అనౌన్స్ చేయాలని సర్క్యూలర్‌లో పేర్కొన్నారు.