హైదరాబాద్‌లో గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సహకార శాఖ కమీషనర్ వీరబ్రహ్మయ్య, ఉద్యానశాఖ కమీషనర్ వెంకట్రాంరెడ్డి, మార్క్ ఫెడ్ ఎండి భాస్కరాచారి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కందుల కొనుగోలు కోటా పెంచండి. 47,500 మెట్రిక్ టన్నులు ఏ మూలకూ సరిపోదు. ఈ సారి 2.7 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని మంత్రి అన్నారు.
47.5 వేల మెట్రిక్ టన్నులకు అదనంగా మరో 56 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు అవకాశం ఇవ్వండి.. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కందుల కొనుగోలుకు కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం తరపున లేఖ రాశాం. ఇక సహకార ఎన్నికల అనంతరం డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికలు అన్నీ సకాలంలో పూర్తికావాలి. దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.పామ్ ఆయిల్ మొక్కలు రైతులకు అందుబాటులో ఉంచాలి. పామ్ ఆయిల్ సాగు చేయాలనుకుంటున్న రైతులకు ప్రోత్సాహం అందించాలని నిరంజన్ రెడ్డి తెలిపారు.
అలాగే రైతులకు యూరియా పంపిణీలో జాప్యం ఉండొద్దు. ఈ నెల రావాల్సిన 2 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా సకాలంలో డ్రా చేయండి. ప్రతిరోజూ యూరియా ఎంత పంపిణీ, ఎంత అవసరం, ఎంత నిలువ ఉంది సరిచూసుకోవాలన్నారు. ప్రతి వారం ఎరువుల కంపెనీలతో సమీక్షలు నిర్వహించాలని మంత్రి సూచించారు. రైతులు మత పంటను మార్కెట్‌కు తీసుకొచ్చాక వారి అన్ని సౌకర్యలు కల్పించాలి. ఇక కోహెడ మార్కెట్ పరిశీలించి అభివృద్దికి తగు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు.