నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి ట్రైలర్ విడుదలైంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా కరీంనగర్ జిల్లాలో తిరుమల థియేటర్లో అభిమానుల సమక్షంలో ట్రైలర్ ను గ్రాండ్‌గా విడుదల చేశారు. నైజాం డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదలైంది. గుర్రంపై స్వారీ చేస్తూ యుద్ధంలో శత్రు సైన్యంతో తలపడుతూ బాలకృష్ణ సినిమాలో కనపడిన తీరుతో అభిమానులు ఫిదా అయిపోయారు. విడుదల కొద్ది గంటల్లోనే ట్రైలర్ ను లక్షల వ్యూస్ సంపాదించింది.
సినిమా ట్రైలర్ ను చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ అభిమాన నటుడిని గౌతమిపుత్ర శాతకర్ణిగా అభిమానులు చూసుకున్నారు. సినిమా టైటిల్ కి తగ్గట్టుగా గౌతమిపుత్ర శాతకర్ణికి తీసిపోని విధంగా బాలకృష్ణలో రాజసం ఉట్టిపడింది.ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ నెల 20వ తేదీ తర్వాత ఆడియో వేడుకను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణి. తెలుగు నేలపై చెరగని ముద్ర వేసిన శాతవాహన మహారాజు. విశ్వశాంతి కోసం కృషి చేసిన యోధుడు. తెలుగు నేలను అప్రతిహతంగా పాలించిన రాజులు శాతవాహనులు. తెలుగు నేలను పాలించిన శాతవాహన రాజుల్లో 23వ వాడు గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో శాతవాహన రాజ్యం విస్తరించింది. పాలన అంటే యుద్ధాలు మాత్రమే కాదు, కళలు, వైభవం, సాహిత్యం కూడా ఉంటాయని ఒకటో శతాబ్దంలోనే ప్రపంచానికి చాటిన కళాపురుషుడు శాతకర్ణి.
ఇక సినిమా ప్రమోషన్‌లో భాగంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ట్రైలర్‌ను 100 థియేటర్స్‌లో విడుదల చేశారు. అంతకముందు ఉదచం కోటిలింగాల ప్రాంతంలోని కోటేశ్వరస్వామి ఆలయంలో బాలకృష్ణ ప్రత్యేకపూజలు చేశారు. నందమూరి తారకరామారావు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.