ప్రజా రవాణాలో ప్రత్యేక గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తూనే సంస్థ ఆర్థికంగా బలపడేందుకు పలు కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తోంది. గత మాసంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు సంస్థ పురోగతికై దిశా నిర్ధేశంతో రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించిన క్రమంలో రూపుదిద్దుకుంటున్న కార్గో పార్సిల్ సర్వీసు సేవల అమలు చేసే తీరుతెన్నులపై ఎం.డి శ్రీ సునీల్ శర్మ, ఐ.ఎ.ఎస్ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
మంగళవారం బస్‌భవన్‌లోని సమావేశ మందిరంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షిస్తూ సంస్థ సమకూర్చుకోవల్సిన ఆదాయ వనరులతో పాటు పార్సిల్స్ రవాణకు సంబంధించి ప్రత్యేకంగా విధి విధానాలపై చర్చించారు. కార్గో సర్వీసు సేవల్ని అందుబాటులోకి తీసుకురావల్సిన విషయంపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. మొదట ప్రాధన్యతలో తెలంగాణ రాష్ట్రంలో, ఇరుగు పొరుగు రాష్ట్రాలకు టి.ఎస్.ఆర్.టి.సి బస్సులు రాకపోకలు సాగిస్తున్న దరిమిలా ఆపై త్వరలో కార్గో పార్సిల్ రవాణా సేవలను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.
నష్టాల్లో ఉన్న సంస్థకు ఇదోక ఆదాయ మార్గంగా భావిస్తూ కార్గో సేవలు ఆశించినట్లుగా ఉండే దిశలో తక్షణమే ప్రణాళికను రూపొందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. మానవ వనరులను సమకూర్చుకోవడంతో పాటు పార్సిల్స్ రవాణాకు సరిపడా కార్గో సర్వీసుల్ని అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరారు. పార్సిల్స్ బుకింగ్స్ కోసం ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వేతర సంస్థలు, ప్రైవేట్ కంపెనీలను సంప్రదించాల్సిన అవశ్యకతను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కాగా, ఇ.డి(రెవెన్యూ, ఐటి), సంస్థ కార్యదర్శి శ్రీ పురుషోత్తం కార్గో సర్వీసు సేవలపై రూపొందించిన కార్యాచరణను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పార్సిల్స్ బుకింగ్స్ కొరకై ఇతర శాఖల అధిపతులను సంప్రదించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇ.డి (ఇ) వినోద్, ఇ.డి(ఎ) టి.వి.రావు, ఇ.డి (ఒ) యాదగిరి, ఎఫ్.ఎ రమేశ్, ఇతర అధికారులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.