రాష్ట్ర ప్రభుత్వ పాలనా వ్యవస్థలో ప్రణాళికా శాఖ పాత్ర అత్యంత కీలకమైందని, అందుకు అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు బాధ్యతతో విధులు నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు.
గురువారం ఖైరతాబాద్ లోని గణాంక భవన్ లో ప్రణాళిక, గణాంక, రిమోట్ సెన్సింగ్ విభాగాల అధికారులు, ఉద్యోగులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఒరవడి, నైపుణ్యంతో పని చేయాలని అన్నారు.
ప్రభుత్వంలోని ప్రతి శాఖ తమ రోజు వారి కార్యక్రమాలకు ప్రణాళిక శాఖ అందించే గణాంకాలు, సర్వే నివేదికలు క్రియాశీలకమని ఆయన గుర్తు చేశారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రణాళిక పట్ల సీఎం కేసీఆర్ మరింత దృష్టిని సారించారని, అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా పని చేయాలని వినోద్ కుమార్ సూచించారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, మౌలిక వసతుల కోసం అప్పులు చేసి ఆస్తులను సృష్టిస్తున్నామని, రానున్న రోజుల్లో ఆ సంపద విలువ వందల రేట్లు పెరుగుతాయని వినోద్ కుమార్ వివరించారు. అప్పులను వృధా చేస్తే తప్పు అని, ప్రణాళికా బద్దంగా అభివృద్ధి కోసం వినియోగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం, శ్రీరాంసాగర్, సుందిళ్ళ, ఎల్లంపల్లి, మెడిగడ్డ, మిడ్ మానేరు వంటి రిజర్వాయర్ లలో 250 టీఎంసి ల నీటి నిల్వలు ఉన్నాయని, ఈ రిజర్వాయర్ లలో చేపల ఉత్పత్తి కోసం ప్రణాళికలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ దేశంలోనే గొప్ప రాష్ట్రంగా ఆవిర్భవించిందని ఆయన అన్నారు. ప్రతి ఉద్యోగి డిస్కస్, డిబేట్, షేర్ పంథాలో పయనించాలని, తద్వారా మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని వినోద్ కుమార్ అన్నారు. ఆర్థిక, ప్రణాళిక శాఖల ముఖ్య కార్యదర్శి కే. రామకృష్ణారావు మాట్లాడుతూ కాలానుగుణంగా కొత్త పంథాను అనుసరించాలని సూచించారు. గణాంకాల సేకరణ, సర్వే అంశాలపై మూస పద్దతిని పక్కన పెట్టి, వినూత్నమైన పద్ధతులను అనుసరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గణాంక శాఖ డైరెక్టర్ ఏ. సుదర్శన్ రెడ్డి, ప్రణాళిక శాఖ డైరెక్టర్ షేక్ మీరా, రిమోట్ సెన్సింగ్ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.