2020లో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుతో శుభారంభం చేస్తామని తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడిన కేటీఆర్…కొత్త మున్సిపల్ చట్టం సమర్థంగా అమలు చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు.
చట్టం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కౌన్సిలర్‌పై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 2020-30 దశకం టీఆర్ఎస్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రానిదేనన్నారు. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు.
కొత్త దశకంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అగ్రగామిగా ఎదుగుతుందన్నారు. ఈ నెల మొదటివారంలో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ సమావేశం ఉంటుందని ..సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు పార్టీ సమాయత్తంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది తాను సీఎం అవుతానన్న చర్చే అవసరం లేదన్నారు.