కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న చారిత్రాత్మక డేనైట్ టెస్టులో భారత బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్ మెన్లు కుప్పకూలిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ కేవలం 30.3 ఓవర్లు ఆడి 106 పరుగులకే ఆలౌట్ అయింది. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ బంగ్లా వికెట్ల కోసం పోటీలు పడ్డారు. ఇషాంత్ శర్మ 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు కెరీర్‌లో ఇషాంత్ పదోసారి 5 వికెట్లు పడగొట్టాడు.
తొలి ఇన్నింగ్స్‌లో సాద్‌మన్ ఇస్లాం(24), లిటన్ దాస్(24 రిటైర్డ్ హర్ట్), నయిం హసన్(19) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్ పేలవ బ్యాటింగ్‌తో నిరాశపరిచారు. ఇమ్రుల్ కైస్(4), మోమినుల్(0), మహ్మద్ మిథున్(0), ముష్ఫికర్ రహీమ్(0), మహ్మదుల్లా(6) ఘోరంగా విఫలమయ్యారు. మరో బౌలర్ మహ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు.ఇక, తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 3 ఓవర్లలో 18 పరుగులు చేసింది.