హైదరాబాద్ నగరంలో ఇండ్లకు నల్లాల ద్వారా జలమండలి సరఫరా చేస్తున్న మంచినీరు సురక్షితమైనదని కేంద్ర ప్రభుత్వం కితాబిచ్చింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దేశంలోని 21 పెద్ద నగరాల్లో జరిపిన అధ్యయనంలో ముంబై మహా నగరం తర్వాత సురక్షితమైన తాగునీటిని సరఫరాచేస్తున్న నగరంగా హైదరాబాద్ రెండోస్థానం దక్కించుకుంది. దేశ రాజధాని ఢిల్లీ చిట్ట చివరి స్థానంలో నిలిచింది. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ బీఐఎస్ నివేదికను విడుదలచేశారు. ఒక్కో నగరం నుంచి 10 శాంపిల్స్ సేకరించి 28 రకాల ప్రమాణాలపై పరీక్షలను నిర్వహించినట్లు పాశ్వాన్ వెల్లడించారు. ముంబైలో పది శాంపిల్స్‌లోనూ అన్ని ప్రమాణాలకు సంబంధించి సత్ఫలితాలు వచ్చాయని, హైదరాబాద్‌లో 9 శాంపిల్స్ అన్ని ప్రమాణాల మేరకు పరీక్షకు నిలబడ్డాయని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు భువనేశ్వర్, రాంచీ.. పది శాంపిళ్లలో ఒక్కో శాంపిల్‌లో విఫలం కాగా, రాయ్‌పూర్ ఐదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి సేకరించిన పది శాంపిళ్లలో ఆరు ఫెయిలయ్యాయని చెప్పారు. సిమ్లాలో ఏకంగా పది శాంపిళ్లలో 9 శాంపిళ్లు పరీక్షలో విఫలమయ్యాయని పాశ్వాన్ తెలిపారు. దాదాపు 13 రాష్ర్టాల రాజధానుల్లో (చండీగఢ్, తిరువనంతపురం, పాట్నా, భోపాల్, గువాహటి, బెంగళూరు, గాంధీనగర్, లక్నో, జమ్ము, జైపూర్, డెహ్రాడూన్, చెన్నై, కోల్‌కతా) నగరాల్లో సేకరించిన శాంపిళ్లలో ఒక్క శాంపిల్ కూడా బీఐఎస్ ప్రమాణాల మేరకు లేవన్నారు. ఈ పరీక్షలు ఏ ఒక్కరినో తక్కువ చేయడానికి కాదని.. ప్రజలందరికీ సురక్షితమైన నీటిని అందించడంపై రాష్ర్టాలను ప్రోత్సహించడంకోసమేనని పాశ్వాన్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ వాటర్ బోర్డు పరిధిలో 10.6 లక్షల మంది తాగునీటి వినియోగదారులు ఉన్నారు. కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా రిజర్వాయర్ల నుంచి రోజూ 468 మిలియన్ గ్యాలన్ల నీటిని జలమండలి సరఫరా చేస్తున్నది. శుద్ధిచేసిన సురక్షితమైన నీటిని నగరంలోని సుమారు 200 సర్వీస్ రిజర్వాయర్లలోకి తరలిస్తున్నారు. ఈ రిజర్వాయర్ల నుంచి నల్లాల ద్వారా ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు చేరేందుకు జలమండలి పకడ్బందీగా చర్యలు తీసుకొంటున్నది. జంటనగరాల్లో 250 క్లోరినేషన్ ప్లాంట్లు ఉన్నాయి. వీటికోసం నెలకు 200 లిక్విడ్ క్లోరిన్ సిలిండర్ల ను వినియోగిస్తున్నారు. నిబంధనల ప్రకారం మిలియన్ లీటర్ల నీటి శుద్ధికి కిలో క్లోరిన్‌ను వినియోగిస్తున్నారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాం ట్ వద్ద లీటర్ నీటిలో 2 పీపీఎం (పార్ట్ పర్ మిలియన్) నిర్వహిస్తున్నారు. సర్వీస్ రిజర్వాయర్ వద్ద 1.5 పీపీఎం.. నల్లా ద్వారా వినియోగదారుడికి చేరే సమయంలో క్లోరిన్ శాతం 0.2 నుంచి 0.5 పీపీఎం తప్పనిసరి ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. నిబంధనల మేరకు 0.5 పీపీఎం కంటే తక్కువ ఉంటే ఆ నీరు సురక్షితం కానట్టే. రిజర్వాయర్లలో నీటినిల్వ సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా క్రిమికీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. నీటిలో క్లోరిన్ రెండు మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత తిరిగి కలిపితేనే నీటి నాణ్యత మెరుగుపడుతుంది. అందుకే క్లోరినేషన్‌కు ప్రామాణిక విధి విధానాలు ప్రకటించి పకడ్బందీ చర్యలు తీసుకొంటున్నారు. సర్వీస్ రిజర్వాయర్ల వద్ద పలుమార్లు పరీక్షలు జరిపాకే సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం సబ్ డివిజన్లో లైన్మెన్లతోపాటు నీటి శాంపిల్స్‌ను పరీక్షించడానికి 50 మంది పనిచేస్తున్నారు. కలుషిత నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో సురక్షిత నీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా మూడు మొబైల్ వాహనాలను సమకూర్చారు. వీటన్నింటితో పాటు ఈపీటీఆర్ఐ, ఐపీఎంలాంటి సంస్థలు ఎప్పటికప్పుడు నీటి శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తున్నాయి
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు సురక్షిత నీటిని అందించడం కోసం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుంది జలమండలి. సంస్థతోపాటు ఐపీఎం లాంటి సంస్థలు రోజూ నీటి శాంపిల్స్ సేకరిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నీటి నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకుండా పనిచేస్తున్నరు. శుద్ధ జలాలను అందించినప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని భావించి అందుకు అనుగుణంగా క్వాలిటీ విభాగాన్ని బలోపేతం చేశారు. ఇప్పటికే నీటి నాణ్యత విషయంలో ఐఎస్ వో సర్టిఫికెట్‌ను సాధించింది జలమండలి. సురక్షిత మంచినీటి కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పేరుతో ఎన్ని పరికరాలు మార్కెట్లోకి వచ్చినా.. వాటర్‌బోర్డు నీరే సురక్షితమని బీఐఎస్ సర్వేలో తేలింది.