చెన్నయ్‌లోని అపోలో ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి కన్నుమూసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపట్ల తెలుగు సినీనటుడు మహేష్‌బాబు సంతాపం తెలిపారు. జయలలిత మృతి చెందడం ఎంతో బాధ కలిగించే విషయమని ఆయన అన్నారు. తమిళనాడు ప్రజలకు సానుభూతి తెలుపుతున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
జయలలిత మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు ధర్మేంద్ర అన్నారు. ఇజ్జత్ సినిమాలో జయలలిత, తాను కలసి నటించామని నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగాలేదని విన్నానని, కోలుకోవాలని ప్రార్థించానని, ఇంతలోనే ఆమె మరణవార్త తనను కలచివేసిందని చెప్పారు. జయలలిత మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
మూడు దశాబ్దాలకు పైగా తమిళనాడు, భారతదేశ రాజకీయాలపై జయలలిత చెరగని ముద్ర వేశారని పవర్ స్టార్,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ‘అమ్మ’ మరణం తమిళనాడుకే కాక యావత్ దేశానికి తీవ్ర లోటు అని , ఆమెకు మన:పూర్వక అంజలి ఘటిస్తూ, పార్టీ తరపున సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళులు అర్పించారు. జయలలిత పార్థివదేహం ఉంచిన చెన్నైలోని రాజాజీ పబ్లిక్ హాల్‌కు రజనీ తన కుటుంబ సభ్యులతో కలసి వచ్చారు. జయ పార్ధివదేహన్ని చూసి రజనీ కంటతడి పెట్టారు. రజనీ వెంట భార్య లత, అల్లుడు ధనుష్, కుమార్తెలు ఉన్నారు. టాలీవుడ్ నటుడు మోహన్‌బాబు స్పందిస్తూ జయలలిత మృతి తమిళనాడు ప్రజలకు తీరనిలోటని అన్నారు. మహిళా శక్తికి ఆమె ఓ నిదర్శనమని చెప్పారు. ఆమె ఓ గొప్ప నేత అని కొనియాడారన్నారు.