దుండగుడి చేతిలో సజీవ దహనమైన అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు నేడు నాగోల్ శ్మశాన వాటికలో జరగనున్నాయి. విజయారెడ్డిని నిన్న ఆమె కార్యాలయంలోనే గౌరెల్లి గ్రామానికి చెందిన దుండగుడు సురేశ్ కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడు. అనంతరం తనపైనా కిరోసిన్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. ఈ ఘటనలో విజయారెడ్డి సజీవ దహనం కాగా, తీవ్ర గాయాలపాలైన నిందితుడు హయత్‌నగర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. విజయారెడ్డి హత్యపై సీఎం కేసీఆర్ సహా ప్రతి ఒక్కరూ ఈ అమానవీయ హత్యను ఖండించారు.. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ ఘటనపై మంత్రి మహ్మద్ అలీ స్పందించారు. నిందితుడు సురేశ్‌పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తహసిల్దార్ విజయారెడ్డి హత్య పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు అధికారులతో మాట్లాడారు. నేరస్తులను పట్టుకుని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విజయారెడ్డి ప్రస్థానం : తహసీల్దార్ విజయారెడ్డి సొంత ఊరు నల్గొండ జిల్లా… శాలిగౌరారం మండలం పెర్కకొండారం. రిటైర్ట్ టీచర్ లింగారెడ్డి దంపతుల రెండో కూతురు ఆమె. నల్గొండలో డిగ్రీ చేసిన ఆమెకు… 13 ఏళ్ల కిందట సుభాష్ రెడ్డితో పెళ్లైంది. వాళ్లకు కూతురు చైత్ర(11), కొడుకు అభినవ్(7) ఉన్నారు. సుభాష్ రెడ్డి… హయత్‌నగర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్. విజయారెడ్డి 2004లో ప్రభుత్వ టీచర్‌గా ఎంపికయ్యారు. 2009లో గ్రూప్-2 పరీక్ష రాసి డిప్యూటీ తహసీల్దార్ అయ్యారు. 2016 అక్టోబరు 11న కొత్తగా ఏర్పడిన అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి తహసీల్దార్‌గా ప్రమోషన్‌పై వచ్చారు. అలాంటి ఆమెను హత్య చేయడంతో… ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.