కాలుష్య నియంత్రణకై ఢిల్లీ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ హెల్త్ ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో పర్యావరణ కాలుష్య నివారణ నియంత్రణ మండలి కమిషనర్ భురే లాల్తో భేటీ అయ్యారు కేజ్రీవాల్. కాలుష్యం నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) అమలుకు, కాలుష్య నివారణకు ఇతర చర్యలను తీసుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని చెప్పారు.
ఢిల్లీలో గురువారం అర్ధరాత్రి వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో శీతాకాలంలో పూర్తిగా బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి. ఈ మేరకు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకుపర్యావరణ కాలుష్య నివారణ&నియంత్రణ మండలి చైర్ పర్సన్ భురే లాల్ లేఖ రాశారు. నవంబర్ 5 వరకు ఎలాంటి భవన నిర్మాణ కార్యకలాపాలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.