ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మంగళవారం నుంచి కార్తీకమాసోత్సవాలు ప్రారంభమైయ్యాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు తెలిపారు. హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం కావడంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి, త్రిలింగ క్షేత్రాలతో పాటు ఇంద్రకీలాద్రి భక్తులతో నిండిపోయింది. నిన్న సూర్యోదయం వేళ అమావాస్య ఘడియలే ఉండటంతో, నేటి నుంచి కార్తీకమాసం మొదలైనట్టు పంచాంగకర్తలు ఉటంకించిన సంగతి తెలిసిందే.
ఇక శ్రీశైలంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఆలయ అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కార్తీక మాసోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆలయ వేళల్లో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించారు. రద్దీ రోజుల్లో సుప్రభాతం, మహా మంగళ హారతి, లక్ష కుంకుమార్చన, నవావరుణ పూజ, బిల్వార్చన తదితర సేవలను రద్దు చేసినట్టు ప్రకటించారు. భక్తులకు సేవలందించేందుకు సిబ్బందికి ప్రత్యేక విధులు అప్పగించారు దేవాలయ ఈఓ కెఎస్.రామారావు.
మరోవైపు శ్రీకాళహస్తిలోనూ ఇదే విధమైన నిర్ణయాలు తీసుకున్నారు. సోమ, శని, ఆది వారాల్లో సేవలను రద్దు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ నుంచి బయలుదేరి ఒక్కరోజులో పంచారామాలను దర్శించుకుని వచ్చేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. ఇక వరంగల్‌లోని సుప్రసిద్ధ వేయి స్థంభాల ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం, నెల రోజుల పాటు జరిగే కార్తీక మాసోత్సవాలను విజయానంద తీర్థ స్వామీజీ, రాజ్య సభ సభ్యుడు బండ ప్రకాష్, ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ ప్రారంభించారు.