క్రికెట్ టీ20 టోర్నీ లో భారత్ జట్టు జయకేతనం ఎగురవేసింది. ఉత్కంఠ భరితంగా ఫైనల్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను 17 తేడాతో ఓడించి ఆసియాకప్ టోర్నీని సొంతం చేసుకుంది. భారత్ విసిరిన 122 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ పోరాడి ఓడింది. బ్యాంకాక్ వేదికగా జరిగిన మహిళల ఆసియాకప్ టీ20 టోర్నీ ఫైనల్లో దాయాది పాకిస్థాన్‌ను టీమిండియా 17 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి టీ20 ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకొంది. గ్రూప్ దశలోనూ పాక్‌ను హర్మన్‌ప్రీత్ సేన ఓడించడం విశేషం. టోర్నీలో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ అమ్మాయిలు వరుసగా గెలవగా వన్డే కెప్టెన్, తెలుగమ్మాయి మిథాలీరాజ్ పరుగులు వరద పారించి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ, ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ అవార్డులు కైవసం చేసుకొంది.
మిథాలీ 73 నాటౌట్
టాస్ గెలిచిన హర్మన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకొంది. ఓపెనర్ స్మృతి మంధన (6; 14 బంతుల్లో) జట్టు స్కోరు 24 పరుగుల వద్ద పెవిలియన్ చేరడంతో ఫామ్‌లో ఉన్న మిథాలీరాజ్ (73 నాటౌట్; 65 బంతుల్లో 7×4, 1×6) ఒంటరి పోరాటం చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (5), మేఘన (9), వేద కృష్ణమూర్తి (20) స్వల్ప పరుగులకే వికెట్లు చేజార్చుకున్నా జూలన్ గోస్వామి (17)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఓపెనర్‌గా వచ్చిన మిథాలీని ఔట్ చేసేందుకు పాక్ బౌలర్లు విఫలయత్నం చేశారు. వెన్నుచూపని మిథాలీ అర్ధశతకంతో అజేయంగా నిలిచి భారత స్కోరును 121/5కి చేర్చింది. టోర్నీలో మిథాలీ 220 పరుగులు చేసింది. ఆనమ్ అమిన్ 2, సనా మిర్ 1, సాదియా యూసఫ్ 1 వికెట్ తీశారు.
సమష్టిగా దెబ్బతీశారు
భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన పాకిస్థాన్‌ను భారత బౌలర్లు సమష్టిగా దెబ్బతీశారు. కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నారు. ఓపెనర్లు ఆయేషా జాఫర్ (15; 14 బంతుల్లో 3×4), జావెరియా ఖాన్ (22; 26 బంతుల్లో 2×4) పాక్‌కు శుభారంభం అందించారు. జట్టు స్కోరు 24 పరుగుల వద్ద ఆయేషాను గోస్వామి క్లీన్‌బౌల్డ్ చేసి వికెట్ల పతనం ఆరంభించింది. వన్‌డౌన్‌లో వచ్చిన అస్మవియా ఇక్బాల్ (1)ని శిఖాపాండే వెంటనే పెవిలియన్‌కు చేర్చింది. కెప్టెన్ బిస్మా మరూఫ్ (25; 26 బంతుల్లో 2×4) కాసేపు పోరాడినా భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్‌ను 104 పరుగులకే కట్టడి చేశారు. ఏక్తాబిస్త్ 2/22, అనుజా పాటిల్ 1/18, గోస్వామి 1/19, శిఖాపాండే 1/17, ప్రీతి బోస్ 1/18 బౌలింగ్‌లో రాణించారు.