సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ కానుక..!

577
cm kcr
- Advertisement -

సింగరేణి కార్మికులు దీపావళి బోనస్‌గా పేర్కొనే పెర్ఫార్మెన్స్ లింక్ డ్ రివార్డు స్కీం (పి.ఎల్.ఆర్.ఎస్.) బోనస్‌ను సింగరేణి సంస్థ శుక్రవారం (అక్టోబర్ 25వ తేదీ) నాడు కార్మికులకు చెల్లించింది. మొత్తం 258 కోట్ల రూపాయలను కంపెనీ చెల్లించగా, ఒక్కొక్క కార్మికుడు 64,700 రూపాయలను బోనస్‌గా అందుకొన్నారు. ఇది పి.ఎల్.ఆర్.ఎస్. బోనస్ చరిత్రలోనే అత్యధికం. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన 28 శాతం లాభాల బోనస్ (దసరా బోనస్) కింద ఈ నెల 1వ తేదీన సింగరేణి కార్మికులు ఒక్కొక్కరు సగటున లక్ష రూపాయలు అందుకొన్నారు. అంటే నెలలోపుగానే రెండు బోనస్‌లు కలిపి ఒక్కో కార్మికుడు ఒక లక్ష 65 వేల రూపాయలను అందుకున్నారు. సింగరేణి చరిత్రలో ఇదే అత్యధికం.

తెలంగాణ రాకపూర్వం అనగా 2013-14 సంవత్సరంలో కార్మికులు అందుకొన్న బోనస్ మొత్తాన్ని తెలంగాణా ఆవిర్భావం తర్వాత అందుకొన్న బోనస్‌తో పోల్చి చూస్తే అత్యద్భుతమైన పెరుగుదలను గమనించవచ్చు. 2013-14లో (తెలంగాణా రాకపూర్వం) ఒక్కో సింగరేణి కార్మికుడు లాభాల బోనస్‌గా 13,540 రూపాయలు, దీపావళి బోనస్ (పి.ఎల్.ఆర్.ఎస్. బోనస్) గా 40,000 రూపాయలు అందుకొన్నాడు. అంటే ఇవి రెండూ కలిపి ఒక్కో కార్మికుడు 53,540 రూపాయలు మాత్రమే పొందగలిగాడు.

kcr

కాగా తెలంగాణా ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో క్రమంగా లాభాల బోనస్ పెంచుతూ వచ్చిన నేపథ్యంలో 2018-19 నాటికి రెండు రకాల బోనస్ లు భారీగా పెరిగాయి. 2018-19 అనగా ఈ ఆర్ధిక సంవత్సరంలో ఒక్కో కార్మికుడు లాభాల బోనస్ కింద సగటున లక్ష రూపాయలు, దీపావళి బోనస్ (పి.ఎల్.ఆర్.ఎస్.) కింద 64,700 రూపాయలు పొందాడు. రెండూ కలిపి ఒక లక్ష 65 వేల రూపాయలకు పైనే స్వీకరించాడు. అంటే తెలంగాణా రాష్ట్రం వచ్చిన తర్వాత గతం కన్నా 209 శాతం అధికంగా లాభాలను అందుకున్నాడని సృష్టమౌతోంది.

ఇదిలా ఉంటే కోలిండియాను అనుసరించి ప్రకటించే లాభాల బోనస్ 2013-14లో 40,000 రూపాయలు ఉండగా, అది ఈ ఏడాది (2018-19)కి 64,700 రూపాయలకు పెరిగింది. అంటే 62 శాతం పెరిగిందన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించే లాభాల బోనస్ మాత్రం నమ్మశక్యం కానంతగా పెరిగిపోయింది. 2013-14లో 20 శాతం లాభాల బోనస్ ప్రకటించగా ఒక్కో కార్మికుడు సగటున 13,540 రూపాయలు మాత్రమే అందుకున్నాడు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఏటేటా లాభాల బోనస్ శాతాన్ని పెంచుతూ రావడం వలన ఈ ఏడాది అది 28 శాతానికి చేరి ఒక్కో కార్మికుడు సగటున ఒక లక్ష 899 రూపాయలను అందుకొన్నాడు. తెలంగాణా రాకపూర్వం తీసుకున్న లాభాల బోనస్ తో పోలిస్తే ప్రస్తుతం లాభాల బోనస్ 645 శాతానికి పెరిగిందన్నమాట. దేశంలో ఏ ఇతర ప్రభుత్వ కంపెనీలో ఇంత పెద్దఎత్తున లాభాల వాటా బోనస్ ను పెంచి చెల్లిస్తున్న పరిస్థితి మనకు ఎక్కడా కన్పించదు.

sccl

పి.ఎల్.ఆర్.ఎస్. (దీపావళి) బోనస్ ఈ ఏడాది 64,700 రూపాయల బోనస్ ను అందుకొన్న కార్మికులకు సంస్థ సి అండ్ ఎం.డి. ఎన్.శ్రీధర్ దీపావళి పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. లాభాల బోనస్‌తో కలిపి సగటున ప్రతీ కార్మికుడు లక్ష 65 వేల రూపాయల వరకు పొందారనీ, ఈ బోనస్ సొమ్మును పొదుపు చేయడం లేదా కుటుంబ అవసరాలకు సద్వినియోగం చేయాలని కోరారు. గత ఆర్ధిక సంవత్సరంలో బాగా పనిచేసినందు వల్లనే 1,766 కోట్ల లాభాలను అర్జించగలిగామనీ, ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో బాగా పనిచేసి గత ఏడాదికి మించి లాభాలు సాధించాలని పిలుపునిచ్చారు. వచ్చిన లాభాలతో సింగరేణి విస్తరణ చర్యలతో పాటు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, లాభాల బోనస్ లు పొందగలిగామని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -