టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ నేతలు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి హుజూర్ నగర్ లోని తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారని ఉత్తమ్ పై ఈసీకి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని బయటకు పంపించాలని టీఆర్‌ఎస్ కోరారు.
కోదాడకు చెందిన ఉత్తమ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రచార గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉన్నారని, ప్రెస్ మీట్ నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అనుచరుల ద్వారా డబ్బులను పంపిణి చేస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు.
ఆలయం కోసం చెక్కు ఇచ్చారని, మెటుపల్లి మండలం భీమ్ ల తండాలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రచారం చేశారని, పలువురిని పార్టీలో చేర్చుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నేరేడు చర్ల మండలం ఓ చర్చితో ఉత్తమ్, పద్మావతి పార్టీ పోస్టర్లు, కండువాలతో సమావేశమై పలు హమీలు ఇచ్చారని వెల్లడించారు. ఉత్తమ్‌పై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఈసీ చర్యలు తీసుకోవడం లేదని టీఆర్‌ఎస్ నేతలు ఆక్షేపించారు.