రైల్వేతో సింగరేణి ‘ఇంజన్ ఆన్ లోడింగ్’ ఒప్పందం..

445
- Advertisement -

సింగరేణి సంస్థకు, దక్షిణ మధ్య రైల్వే విభాగానికి మధ్య వ్యాగన్ల లోనికి జాప్యం లేకుండా బొగ్గు లోడింగ్, సత్వరమే రవాణా అనే అంశంపై సోమవారం (సెప్టెంబర్ 30వ తేదీ) నాడు ఒక ఒప్పందం కుదిరింది. మంచిర్యాల జిల్లా శ్రీ రాంపూర్ ఏరియా సైడింగ్స్, మందమర్రి సైడింగులకు సంబంధించి కుదిరిన ఈ ఒప్పందం అటు రైల్వే శాఖకు, ఇటు సింగరేణికి మేలు చేయనుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో దాదాపు 80 శాతం అనగా 520 లక్షల టన్నుల బొగ్గు రైల్వే వ్యాగన్ల ద్వారానే వినియోగదారులకు చేరవేయడం జరగుతోంది. సింగరేణి సి.హెచ్.పి.సైడింగులకు వచ్చిన రైల్వే గూడ్సు బండ్లు బొగ్గును లోడింగ్ చేసుకొని, నిర్ణీత వినియోగదారులకు చేరవేస్తుంటాయి. దీనికి సంబంధించి ‘ఫ్రైట్’ (రవాణా) చార్జీలను రైల్వేశాఖకు చెల్లించడం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఉన్న పద్ధతి ప్రకారం సి.హెచ్.పి. వద్దకు రైల్వే వ్యాగన్లను తెచ్చిన ఇంజను వాటిని లోడింగ్ కోసం అక్కడే వదిలిపెట్టి, లోడింగ్ పూర్తయిన సమాచారం తెల్సిన తర్వాత తిరిగి వచ్చి వ్యాగన్లను తీసుకొని నిర్ణీత ప్రదేశానికి రవాణా చేస్తుండేవి. ఈ పద్ధతి వలన లోడింగ్ జరపడానికి, తిరిగి ఇంజన్ వచ్చి లోడ్ అయిన వ్యాగన్లు తీసుకెళ్లడానికి 6 నుండి 8 గంటల సమయం పడుతుండేది. కనుక వెయిటింగ్ చార్జీలను చెల్లించాల్సి వస్తుండేది.

Singareni

కానీ సింగరేణి సంస్థ తన సి.హెచ్.పి.లను ఆధునీకరించిన నేపథ్యంలో ‘లోడింగ్’ ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతోంది. వచ్చిన ర్యేకును వచ్చినట్టే నింపి పంపించే సామర్ధ్యాన్ని సి.హెచ్.పి. లు ఇప్పుడు వృద్ధి చేసుకొన్నాయి. కాబట్టి గతంలో వలె సి.హెచ్.పి.లలో బొగ్గు లోడింగ్ కోసం వ్యాగన్లు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ‘ఇంజన్ ఆన్ లోడింగ్’ అనే ఒప్పందాన్ని సింగరేణి సంస్థ రైల్వే శాఖలు కుదుర్చుకొంటున్నాయి. దీని ప్రకారం సింగరేణి సంస్థ తన సైడింగ్ కు (సి.హెచ్.పి.)కి వచ్చిన ర్యేకు (58 వ్యాగన్లు గల రైలు బండి) ని 3 గంటల సమయంలోపే బొగ్గు లోడింగ్ జరిపి బయటకు పంపించాలి. అలా చేసినట్లయితే రైల్వేశాఖ వారు గతంలో వలె వెయిటింగ్ చార్జీలను వసూలు చేయరు. కానీ 3 గంటల సమయం దాటితే మాత్రం చార్జీలు వసూలు చేస్తారు.

ఈ ఒప్పందం వలన సింగరేణి సంస్థ వేగంగా బొగ్గు లోడింగ్ జరిపే బాధ్యతను విధిగా స్వీకరిస్తుంది. తద్వారా రైల్వే శాఖ వారు కూడా తమ ర్యేకులను వెయిటింగ్ లో ఉంచకుండా గరిష్టంగా రవాణా కోసం వినియోగించుకోగలుగుతారు. అంతే కాదు వినియోగదారుడు కూడా నిర్ణీత సమయానికి బొగ్గును పొందగలుగుతాడు. ఈ విధంగా అందరికీ ఎంతో మేలు చేసే ‘ఇంజన్ ఆన్ లోడ్’ ఒప్పందం ఇప్పటికే సింగరేణిలోని 5 సైడింగ్సులో విజయవంతంగా అమలవుతోంది. కాగా తాజాగా శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాలకు కూడా దీన్ని వర్తింపచేస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పంద పత్రాలపైన రైల్వేశాఖ నుండి చీఫ్ కమర్షియల్ మేనేజర్ శ్రీ ఎస్.క్రిష్టఫర్, డిప్యూటీ సి.సి.ఎం. బి. ఎస్. క్రిష్టఫర్, సింగరేణి నుండి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ జె.ఆల్విన్, అడిషనల్ జనరల్ మేనేజర్ శ్రీ ఎన్.వి.కె.శ్రీనివాసు లు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం అక్టోబర్ 10వ తేదీ నుండి అమలులోకి రానుంది.

- Advertisement -