దేశమంతా ఒకే భాష ఉండాలని, ఒకే దేశం-ఒకే భాష విధానం ఉంటే బాగుంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. దీంతో దక్షిణాది రాష్ట్రాలన్నీ భగ్గుమన్నాయి. దక్షిణాదికి చెందిన పలు రాజకీయపార్టీల నేతలు,బీజేపీ మద్దతిస్తున్న రజనీ సైతం కేంద్రం తీరును తప్పుబట్టారు.
తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. ఏ భాషనూ బలవంతంగా ఇతరులపై రుద్దడం కానీ, వ్యతిరేకించడం గానీ చేయొద్దని సూచించారు. ప్రజలు ఎక్కువ భాషలు నేర్చుకోవడం మంచిదేనని, కానీ ఏదో ఒక భాషను బలవంతంగా ప్రజలపై రుద్దాలనుకోవడం సరికాదని పేర్కొన్నారు.
అదే సమయంలో మరో భాషను కూడా వ్యతిరేకించడం చేయకూడదని హితవు పలికారు. విద్యార్థులు వీలును బట్టి తమ తల్లిదండ్రుల సహకారంతో దేశంలోని అన్ని పర్యాటక ప్రాంతాలు చుట్టి రావాలని, దీని ద్వారా వేర్వేరు ప్రాంతాల సంస్కృతులు, భిన్న ఆహార అలవాట్లు, భాష వంటి వాటిపై అవగాహన ఏర్పడుతుందని విద్యార్థులకు సూచించారు.