150 అడుగుల లోతుఉన్న పాడుబడిన బావిలో పడ్డ వృద్దుడిని కాపాడి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు శంషాబాద్ రూరల్ పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ గ్రామశివారులోని బావిలో కాలు జారి పడిపోయిన వ్యక్తిని సుమారు 4 గంటల పాటు శ్రమించి ప్రాణాలతో కాపాడిన పోలీసులు.
చెట్టు ఆకులకోసం బావివద్దకు వెళ్ళిన వ్యక్తి ప్రమాదవశాత్తు కాలు జారి 150 అడుగుల లోతులోని పాడుబడ్డ బావిలో పడ్డాడు.
విషయం తెలుసుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తాళ్ళ సహాయంతో బావిలోపలకు దిగి గంటలపాటు శ్రమించి ప్రాణాలతో కాపాడిన వృద్దుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.బావిలో పడ్డ వ్యక్తిని ప్రాణాలతో కాపాడినందుకు గ్రామస్తులు పోలీసులను ప్రశంసించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద తూప్ర గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు టేకుమళ్ళ చంద్రయ్య సాయంత్రం నాలుగు గంటల సమయంలో చెట్టు ఆకులకోసం గ్రామ శివారులో ఉన్న బావివద్దకు వెళ్ళాడు.
బావి అంచున ఉన్న చెట్టు ఆకులను తెంపుతూ ప్రమాదవశాత్తూ జారీ బావిలో పడి పోయాడు. సమీపంలో ఉన్న గ్రామస్థులు ఈ విషయం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న కానిస్టేబుల్స్ కృష్ణమాచారి, శ్రీశైలం, కృష్ణ, నరేష్ లు తాడు సహాయంతో లోపలకు దిగారు.
అంతకుముందు గానే 108 కు సమాచారం అందించి క్రేన్ తెప్పించడంతో క్రేన్ సహాయం తో వృద్దుడు చంద్రయ్యను బయటకు తీసి చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.