దేశవ్యాప్తంగా గణేశ్ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక హైదరాబాద్ గణేశ్ పండగ అంటే మనకు గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. 60అడుగుల ఎత్తులో దర్శనమిచ్చే ఈవినాయకుడికి పలు ప్రత్యేకతలున్నాయి. ఉదయం విగ్రహాన్ని ప్రతిష్టించగా పలువురు ప్రముఖులు వచ్చి దర్శించుకుంటున్నారు. బీజేపీ సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్ బండారు దత్తాత్రేయ గణేశుడిని దర్శించుకున్నారు.
ఇక మధ్యాహ్నం 12గంటలకు తెలంగాణ గవర్నర్ నరసింహన్ దంపతులు తొలి పూజ చేయనున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి కొలువదీర్చనున్నారు. ఈ పూజలో గవర్నర్ దంపతులతో పాటు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పోరేటర్ విజయారెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. దేశంలోనే ఎంతోపేరు ప్రఖ్యాతున్న ఖైరతాబాద్ వినాయకుడిని ఈసారి నిర్వాహకులు 12 తలలతో నిలబెట్టారు.
24 చేతులు, 12 సర్పాల సంరక్షణలో 61 అడుగుల నిలువెత్తు ద్వాదశాదిత్య మహాగణపతిని ఈఏడాది కొలువుదీర్చారు. విగ్రహం కోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చుచేసిన నిర్వాహకులు పూలుమాలలు, ఇతర అలంకరణ కోసమే రూ.2 లక్షలు వెచ్చిస్తున్నట్లు సమాచారం. బంతి పూలు (పసుపు, ఎరువు) 300 కిలోలు, చామంతి వంద కిలోలు, ఆకులు 200 కిలోలు, అశోక్ మొక్కలు వంద, అరటి మొక్కలు 30 అలంకరణలో వినియోగిస్తున్నారు. భక్తుల దర్శనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నీ ఏర్పాట్లు చేశారు అధికారులు.