రిటైర్మెంట్‌పై రాయుడు మరో సంచలన నిర్ణయం..

494
ambati rayudu
- Advertisement -

క్రికెటర్ అంబటి రాయుడు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. కొన్నివారాల కిందట ప్రకటించిన తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ సంఘానికి రాసిన లేఖలో స్పష్టం చేశాడు. అన్ని ఫార్మాట్లలో ఆడతానని రాయుడు తన లేఖలో పేర్కొన్నాడు.

తన రిటైర్మెంట్‌ నిర్ణయం అనేది ఆవేశంలో తీసుకున్నదేనని స్పష్టం చేశాడు. తాను మళ్లీ క్రికెట్‌ ఆడాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. తనవరకూ చూస్తే ఆడాల్సిన క్రికెట్‌ చాలా ఉందంటూ తెలిపాడు. గత రెండేళ్లుగా భారత వన్డే ప్రపంచకప్‌ జట్టు ప్రణాళికల్లో ఉండి కూడా ప్రపంచకప్‌ ఆడలేకపోవడంతో రాయుడు ఆకస్మికంగా రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. తాజాగా ఇప్పుడు అతను మనసు మార్చుకొని బ్యాట్‌ పట్టేందుకు సిద్ధమయ్యాడు. హెచ్‌సీఏ నిర్వహించే వన్డే, టి20 క్రికెట్‌ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానని అతను చెప్పాడు.

ambati-rayudu

ఈ క్రమంలో తనకు మద్దతుగా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) మేనేజ్‌మెంట్‌తో వీవీఎస్‌ లక్ష్మణ్‌, నోయల్‌ డేవిడ్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. తాను గడ్డు సమయాన్ని ఎదుర్కొన్నప్పడు అండగా నిలిచిన వారికి అంబటి రాయుడు ధన్యవాదాలు తెలియజేశాడు.

వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో తనకు చోటు కల్పించకపోవడం పట్ల రాయుడు భారత సెలెక్టర్ల బృందంపై అలకబూనిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పైనా సెటైర్ వేసి ఇబ్బందుల్లో పడ్డాడు. పర్యవసానంగా, రిజర్వ్ ప్లేయర్ కోటాలో కూడా మధ్యంతర ఎంపికకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో, తాను ఇక క్రికెట్ ఆడలేనంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ కు అన్ని ఫార్మాట్లలో రిటైర్మెంటు ప్రకటించాడు. ఆఖరికి బీసీసీఐ ఆధ్వర్యంలోని ఐపీఎల్ లో కూడా ఆడబోనని తేల్చిచెప్పాడు.

- Advertisement -