కొత్త సచివాలయం నిర్మాణంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం ఉదయం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రగతిభవన్ లో కలిసి నివేదిక సమర్పించింది. ఆర్ అండి బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
సచివాలయాన్ని కూల్చివేయడమే మంచిదని నిపుణుల కమిటీ పేర్కొన్న సంగతి తెలిసిందే. వీవీఐపీలకు రక్షణ కల్పించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అగ్ని ప్రమాదాలు వంటివి చోటుచేసుకునే అవకాశం ఉందని, కొన్ని భవనాలు పాతబడిపోయాయని, సరైన పార్కింగ్ సదుపాయాలు కూడా లేవని వివరించింది. ఈ మేరకు తమ నివేదికను బుధవారం కేబినెట్ సబ్‌కమిటీకి సమర్పించింది.
సచివాలయ భవనాలను కూల్చవద్దని కొందరు కోర్టును ఆశ్రయించడం, ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వం కోర్టుకు సమర్పించనుంది. కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత సచివాలయ భవనాల కూల్చివేత కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.