నేను గులాబీ సైనికుడిని..మా నాయకుడు కేసీఆరే

757
etela
- Advertisement -

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గెలిచేది గులాబీ జెండానేనని స్పష్టం చేశారు మంత్రి ఈటల రాజేందర్. హుజురాబాద్‌లో కాంగ్రెస్ నాయ‌కుడు కాసిపేట శ్రీ‌నివాస్ చేరిక సంద‌ర్భంగా మాట్లాడిన ఈటల మన నాయ‌కుడు ముఖ్య‌మంత్రి కేసీఆరే.. త‌ప్పుడు వార్త‌ల‌తో అవ‌మానించాల‌ని చూడ‌వ‌ద్దని కోరారు. నిరాధార‌మైన వార్త‌లు ప్రచురించవద్దు,ప్రసారం చేయవద్దని కోరిన ఈటల సోష‌ల్ మీడియా సంయ‌మ‌నంతో ఉండాలన్నారు.

తాను చేసిన ప్ర‌సంగాన్ని కొన్ని వార్త ఛాన‌ళ్లు, సోష‌ల్ మీడియాలోని కొన్ని వ‌ర్గాలు వ‌క్రీక‌రించాయి. ఇది స‌రికాదు. నేను గులాబీ సైనికుడిని. మా నాయ‌కుడు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. రాబోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ముమ్మాటికీ గులాబీ జెండానే ఎగురుతుందన్నారు.

తాను పార్టీలో చేరిన‌నాటి నుంచి.. నేటి వ‌ర‌కు గులాబీసైనికుడినే. మా నాయ‌కుడు ముఖ్య‌మంత్రి కేసీఆరే. ఇటీవ‌ల కాలంలో కొన్ని వార్త‌ప‌త్రిక‌లు (ద‌క్క‌న్ క్రానిక‌ల్‌)లో, సోష‌ల్ మీడియాలో మా పార్టీ అంటే గిట్ట‌నివాళ్లు, నా ఎదుగుద‌ల‌ను ఓర్వ‌లేనివారు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. నేను ఒక కులానికి ప్ర‌తినిధిని అన్న‌ట్టు, డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డే వ్య‌క్తిగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ నేప‌థ్యంలోనే నేను ఈ రోజు హుజురాబాద్‌లో మాట్లాడానని చెప్పారు.

చిల్ల‌ర‌వార్త‌లు వ‌ద్ద‌ని చెప్పాను. తెలంగాణ ఉద్య‌మం ప్రారంభ‌మ‌య్యే నాటికే నేను ప‌ది ల‌క్ష‌ల కోళ్ల‌ ఫారానికి య‌జ‌మానిన‌ని చెప్పిన‌. క‌మ‌లాపుర్ (ప్ర‌స్తుత హుజురాబాద్‌) నియోజ‌క‌వ‌ర్గానికి న‌న్ను పంపించి, ఇక్క‌డ పోటీచేయించి గెలిపించింది మా నాయకుడు కేసీఆరే. ఇదే విష‌యాన్ని కూడా చెప్ప‌. మేము గులాబీ సైనికుల‌మ‌ని చెప్పిన‌. రాజ‌కీయాల్లో సంపాదించుకోవ‌డానికి రాలేదు.. నేను పార్ట‌లో, ఉద్య‌మంలో చేరేనాటికి పారిశ్రామిక‌వేత్త‌న‌ని చెప్పిన‌. ఓ పార్టీనాయ‌కుడు ఇటీవ‌ల‌ ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నంపై స్పందించాల‌ని వేదిక‌పై కోర‌డంతో ఆ ప‌త్రిక‌పై నేను చేసిన కామెంట్ల‌పై రంధ్రాన్వేష‌ణ చేస్తున్నారు. ఇది స‌రికాదు. నా పార్టీ టీఆర్ఎస్‌, మా నాయ‌కుడు కేసీఆర్‌ అని స్పష్టం చేశారు.

ఆనాడు పార్టీ మారాల‌ని వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి అనేక ర‌కాలుగా ఒత్త‌డి తెచ్చినా లొంగ‌ని వ్య‌క్తి ఈట‌ల రాజేంద‌ర్‌. ఈ ఉద్య‌మ పుణ్యానే నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన‌. నిరాధార‌మైన వార్త‌ల‌ను ప్ర‌సారం చేయ‌డం ఆపాలి, సోష‌ల్ మీడియా సంయ‌మ‌నంతో ఉండాలి. నా ప్ర‌సంగ‌పాఠాన్ని పూర్తిగా చూడండని కోరారు.

- Advertisement -