ట్విట్టర్లో ఎప్పటికప్పుడు నెటిజన్ల విజ్ఞపులపై స్పందించడంలో.. సాయం చేయడంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ముందే ఉంటారు. గతంలో ‘వేదం’ సినిమాలో సిరిసిల్ల రాములుగా నటించిన నటుడు నాగయ్య దీనస్థితిపై కేటీఆర్ స్పందించిన సంగతి తెలిసిందే. నాగయ్యను తన నివాసానికి పిలిపించి అతనికి రూ.లక్ష చెక్కును అందించారు. ప్రాంతమేదైనా.. వ్యక్తులెవరైనా ఆదుకుంటామని కేటీఆర్ అప్పట్లోనే తెలిపారు. తాజాగా మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు కేటీఆర్. రెండు కిడ్నీలు చెడిపోయి, సహాయం కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళకు సాయం చేసేందుకు ఆయన ముందుకొచ్చారు.
వివరాళ్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని ఉప్పల్ లో 55 ఏళ్ల కరుణ ఓ అనాథ శరణాలయాన్ని నిర్వహిస్తున్నారు. ‘కారుణ్య ఆర్ఫా అండ్ ఓల్డేజ్ హోమ్’ పేరిట ఆమె నిర్వహిస్తున్న ఆశ్రమంలో 70 మంది అనాథ చిన్నారులు, నలుగురు వితంతువులు ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఆమె రెండు కిడ్నీలు చెడిపోవడంతో నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు నిమ్స్ లో చికిత్స అందించాల్సిన అవసరం ఉందని.. వైద్య ఖర్చులకు రూ. 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని… ‘హృదయ స్పందన’ అనే స్వచ్ఛంద సంస్థ ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించింది. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్ “ఆమె వివరాలు పంపండి… ఆమెకు తప్పకుండా సహాయం చేస్తా”, అంటూ ఆయన ట్విట్టర్లో తెలిపారు.