గడిచిన ఎన్నికల్లో నిజామాబాద్ ప్రజలకు అబద్దపు మాటలు చెప్పి బీజేపీ నేత ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచారన్నారు నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు ఈగ గంగారెడ్డి. ఈసందర్భంగా ఆయన నిజామాబాద్ లోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఎంపీగా గెలిచిన 15రోజుల్లోనే పసుపు బోర్డ్ తీసుకువస్తానని చెప్పి ఎంపీ అర్వింద్ ప్రజలకు మోసం చేశారన్నారు.
బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.రూ.1500 కోట్లతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పునరుజ్జీవం పథకంతో రైతులకు నీరు అందించే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. కాళేశ్వరం నీళ్లను చూసి బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదన్నారు. రూ.
900 కోట్ల తో నిజామాబాద్ నగర అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
జిల్లా ప్రజలను మోసం చేస్తున్న ఎంపీ అర్వింద్ త్వరలోనే ప్రజలు బుద్ది చెబుతారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. ఎంపీగా గెలిచిన తర్వాత అరవింద్ జిల్లా కోసం ఏం చేశారో.. త్వరలో ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.