మాజీ జెడ్పీటీసీకి సీఎం కేసీఆర్ ఫోన్‌

543
cm kcr Zptc
- Advertisement -

మాజీ జెడ్పీటీసీ సభ్యుడికి ఫోన్ చేసి ఆశ్చర్యపరిచారు సీఎం కేసీఆర్. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి జడ్పీటీసీ మాజీ సభ్యుడు కొనుకటి లచ్చిరెడ్డికి శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది. మధ్యమానేరుకు వస్తున్న వరదనీటి గురించి అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం యథావిధిగా లచ్చిరెడ్డి పొలానికి నీళ్లు పెడుతుండగా ఉదయం 11.08 గంటలకు సీఎం కార్యాలయం ల్యాండ్‌ఫోన్ నుంచి లచ్చిరెడ్డి సెల్‌కు కాల్ వచ్చింది. నేను సీఎం కార్యాలయం నుంచి పరమేశ్వర్‌రెడ్డిని మాట్లాడుతున్న లచ్చిరెడ్డి గారూ.. లైన్‌లో ఉండండి. మీతో సీఎం గారు మాట్లాడతారు అని ముఖ్యమంత్రికి ఫోన్ ఇచ్చారు.

Lachi-Reddy1

ఈ సందర్భంగా సీఎం, లచ్చిరెడ్డి మధ్య జరిగిన సంభాషణ వారి మాటల్లోనే..

సీఎం కేసీఆర్: లచ్చిరెడ్డీ బాగున్నవా? బిడ్డ, పిల్లలు అందరు క్షేమమేనా?
లచ్చిరెడ్డి: సార్ మీ దయవల్ల అందరూ క్షేమంగానే ఉన్నరు.

సీఎం: సరే! ఇప్పుడు ఎక్కడున్నవ్?
లచ్చిరెడ్డి: సార్ విలాసాగర్ తోవకు పోయే పొలం వద్ద ఉన్న.

సీఎం: శాభాష్‌పల్లి బ్రిడ్జి దగ్గరకు వెళ్లడానికి ఎంత సమయం పడుతది?
లచ్చిరెడ్డి: సార్ 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది.

సీఎం: సరే వెళ్లు.. నాకు అక్కడి నుంచి వీడియో కాల్ చేసి మాట్లాడు, నీళ్లు ఎంత మేరకు వచ్చాయో చూసి చెప్పు.
లచ్చిరెడ్డి: సరే సార్. (తర్వాత లచ్చిరెడ్డి శాభాష్‌పల్లి హైలెవల్ వంతెన కిందకు చేరుకున్నారు. సీఎంకు ఫోన్‌చేయగా సిగ్నల్ లేక వీడియోకాల్ కనెక్ట్ కాలేదు. నిమిషాల వ్యవధిలోనే సీఎం నుంచి వీడియోకాల్ వచ్చింది.)

సీఎం: నీళ్లు వస్తున్నయా లచ్చిరెడ్డి?
లచ్చిరెడ్డి : వస్తున్నయ్ సర్.

సీఎం: ఎక్కడ ఉన్నవ్?
లచ్చిరెడ్డి: శాభాష్‌పల్లి బ్రిడ్జి వద్ద సర్

సీఎం: కొత్త బ్రిడ్జా? పాత బ్రిడ్జా?
లచ్చిరెడ్డి: కొత్త బ్రిడ్జే సర్.

సీఎం: శాభాష్‌పల్లి పాత వంతెన మునిగిందా?
లచ్చిరెడ్డి;మునిగింది సార్.

సీఎంఃనీళ్లు ఎలా వస్తున్నయ్?
లచ్చిరెడ్డి: బాగానే వస్తున్నయ్ సార్.

సీఎం: ఎవుసం ఎట్లా ఉన్నది. డ్యాంలో పోగా నీలోజిపల్లి, కొదురుపాకలో భూములు ఏమైనా ఉన్నయా?
లచ్చిరెడ్డి : 216 ఎకరాలు పునరావాస (ఆర్‌అండ్‌ఆర్) కాలనీకి పోయినయ్. దాదాపు వంద ఎకరాల భూములు మిగిలినయ్ సార్.

సీఎం: ఏయే పంటలు వేసిన్రు? పంటలు ఎలా ఉన్నయ్?
లచ్చిరెడ్డి: మక్క, వరి పంటలు వేసినం. నాట్లు పడుతున్నయ్.

సీఎం: నాట్లు వేయడం ఎందుకు లేటయింది?
లచ్చిరెడ్డి: కాలం కాలేదు కద సార్, మీరు వరద కాలువకు నీళ్లు విడిచాక దున్ని, నాట్లు వేసుకుంటున్నం. వరద కాలువకు నీళ్లు విడువడం చాలా సంతోషంగా ఉన్నది సార్. రైతులందరూ సంతోషంగా ఉన్నరు.

సీఎం: మరి ఇప్పుడు రైతులు, ప్రజలు తృప్తిగా ఉన్నరా?
లచ్చిరెడ్డి: లింక్ కెనాల్ ద్వారా నీళ్లు వస్తున్నయ్. మీ దయతో రైతులంతా సంతోషంగా ఉండి సాగు చేసుకుంటున్నరు.

సీఎంః లింకు కెనాల్‌తో లాభమేనా?
లచ్చిరెడ్డి: లాభమే సర్. కానీ, అక్కడక్కడ కట్టలు కట్టాలి.

సీఎం: వెంటనే మీ ఎమ్మెల్యే నుంచి నాకు లెటర్ పెట్టించు. నిధులు మంజూరుచేసి పనులు చేయిస్త.

లచ్చిరెడ్డిః సర్. ధన్యవాదాలు.

సీఎం: ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నయా?
లచ్చిరెడ్డి: చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నయ్ సార్. గ్రామానికి నలుగురైదుగురికి పరిహారం రావాలి, 18 ఏళ్లు నిండినవారికి పరిహారం ఇవ్వాలి, కొందరి పేర్లు అదర్స్ పడ్డాయి. వీటిని సరిచేయాలి. రూ.5.4 లక్షల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి.

సీఎం: 5.4 లక్షల ప్యాకేజీ ఆడిట్ ప్రాబ్లమ్ అవుతుంది. ఈ ప్రాజెక్టులో ఇస్తే తెలంగాణ మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తే ఎన్ని కోట్లు అవుతయ్?
లచ్చిరెడ్డి: సార్ నాకు ఐడియా లేదు. తెలువదు సార్.

సీఎం: చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేస్త. ఇప్పుడే రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు చెప్త. మీ ఎంపీపీని, జెడ్పీటీసీని తీసుకెళ్లి కలువు. సమస్యలపై రిప్రజేంటేషన్ ఇవ్వండి. రైతులంతా సంతోషంగా, ఆనందంగా ఉండడమే నా లక్ష్యం. సమస్యల పరిష్కారానికి ఐదు,పది కోట్లు ఎక్కువైనా ఇచ్చేద్దాం. ఓకేనా.. ఇంకా ఏమైనా ఉంటే మళ్లీ మాట్లాడత.
లచ్చిరెడ్డి: సార్ ఇక్కడ మా ఎంపీపీ ఉన్నరు. ఒక్క నిమిషం మాట్లాడండి సార్.

సీఎం: సరే ఓకే ఇవ్వు..

ఎంపీపీ వేణుగోపాల్ః నమస్కారం సార్. నేను ఎంపీపీని
సీఎం: ఓకే, మధ్యమానేరు జలాశయం నీళ్ల గురించి ప్రజలకు, రైతులకు చెప్పండి.. అవగాహన కల్పించండి. ప్రజలకు, రైతులకు మంచి సేవ చేయండి.

మధ్యమానేరు నిర్వాసితుల పెండింగ్ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడిన సందర్భంగా చేసిన సూచన మేరకు రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లికి చెందిన మాజీ జెడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, ఎంపీపీ వేణుగోపాల్ శుక్రవారం రాత్రి జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌తో సమావేశమయ్యారు.

- Advertisement -