ఆర్.ఎక్స్.100 ఫేమ్ కార్తికేయ హీరోగా, మలయాళ భామ అనఘ నాయికగా తెరకెక్కిన చిత్రం `గుణ 369`. బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ జంధ్యాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టీజర్, ట్రైలర్‌ను చూస్తే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా ఉన్న ఈ మూవీతో కార్తీకేయ హిట్ కాట్టాడా….?తొలి సినిమాతో అర్జున్ జంధ్యాల ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం…
కథ:
గద్దలగుంట రాధ(ఆదిత్యమీనన్) పెద్ద రౌడీ. సెటిల్‌మెంట్స్ చేసే రాధ అంటే ఒంగోలులో అందరికి హడల్. ఒంగోలులో ఓ కుర్రగ్యాంగ్ అక్కడ బీచ్‌లోకి వచ్చే అమ్మాయిలను రేప్ చేసి వీడియోలు తీసి బెదిరిస్తుంటారు. గుణ(కార్తికేయ) ఓ గ్రానైట్ క్వారీలో పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో గీత(అనఘ)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. గుణ స్నేహితుడు(మహేశ్)కి తెలిసిన స్నేహితుడు, అతని ఫ్రెండ్స్ అమ్మాయిలను గ్యాంగ్ రేప్ చేసే బ్యాచ్. సీన్ కట్ చేస్తే రాధకి గుణ ఫ్రెండ్స్‌కి గొడవ జరగడం,రాధ చనిపోవడం,ఆ కేసు గుణపై పడటంతో జైలుకి వెళ్తాడు. ఇక జైలు నుంచి వచ్చిన తర్వాత గుణ ఏం చేశాడు…?తాను ప్రేమించిన గీత ఎలా చనిపోయింది..?ఈ మిస్టరీని గుణ ఎలా చేధించాడు అన్నది తెరమీద చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,యాక్షన్,సెకండాఫ్ ఆధ్యంతం ట్విస్ట్‌లతో సాగడం. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకుసాగుతున్న కార్తీకేయ.. గుణగా మెప్పించాడు. యాక్షన్,ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. అనఘ డిఫరెంట్ పాత్రను చేసింది. తనదైన నటనతో మెప్పించింది. రంగస్థలం తర్వాత మంచి పాత్రలో కనిపించాడు మహేశ్. సినిమా అంతా మహేశ్‌ను బేస్ చేసుకునే రన్ అవుతుంది. ఇక మిగితా నటీనటుల్లో ఆదిత్య మీనన్,నరేశ్, హేమ, కౌముది, శివాజీరాజా తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్. కాస్త లవ్ ట్రాక్‌పై శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. పాటలు అంతగా ఆకట్టుకోవు.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. తన గురువు బోయపాటి శ్రీనులానే పక్కా మాస్ ఎంటర్ టైనర్‌ని తెరకెక్కించాడు అర్జున్ జంధ్యాల. రామ్‌రెడ్డి కెమెరా పనితనం బాగుంది.నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
ప్రస్తుత సమాజంలో అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలను బేస్ చేసుకుని దర్శకుడు అర్జున్ జంధ్యాల చేసిన ప్రయోగమే గుణ 369. కార్తికేయ నటన,యాక్షన్,సెకండాఫ్ సినిమాకు ప్లస్ కాగా హీరో,హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ లేకపోవడం మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ గుణ 369.
విడుదల తేదీ: 02/08/2019
రేటింగ్:2.75/5
నటీనటులు: కార్తికేయ, అనఘ
సంగీతం: చైతన్ భరద్వాజ్
నిర్మాతలు: అనీల్ కడియాల, తిరుమల్‌రెడ్డి
దర్శకుడు: అర్జున్ జంధ్యాల