టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్ ,కాలేరు వెంకటేష్ ,మాగంటి గోపినాథ్లు టీఆర్ఎస్ఎల్పీ ఆఫీసు వద్ద మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఠా గోపాల్ మాట్లాడుతూ..బీజేపీ వాపును చూసి బలుపు అనుకుంటోంది.. ఆసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 103 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని ముఠా గోపాల్ ఎద్దేవ చేశారు.స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది జడ్పీటీసీ స్థానాలను మాత్రమే గెలిచిందని.. కేంద్ర మంత్రులు,కార్యదర్శులు టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును మెచ్చుకుంటుంటే బీజేపీ లక్ష్మణ్ ఏవేవో మాట్లాడుతున్నారని అని అన్నారు.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారి బిపిన్ చంద్ర కెసిఆర్ ప్రవేశ పెట్టిన మిషన్ భగీరథను మెచ్చుకుంటూ ఆయనకు నోబెల్ బహుమతి ఇచ్చినా తప్పు లేదన్నారు. బీజేపీ ఎపుడూ టీఆర్ఎస్ స్థాయికి చేరుకోలేదు.బీజేపీకి తెలంగాణలో స్థానం లేదు.మత రాజకీయాలకు తెలంగాణ లో స్థానం లేదన్న సంగతి లక్ష్మణ్ గ్రహించాలి.బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని అనడం పగటి కలే అని అన్నారు.
ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ.. బీజేపీకి తెలంగాణలో ఉనికి లేదు. గతంలో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలుంటే ఇపుడు ఒక్కరయ్యారు.కేంద్రం నుంచి ఒక్క పైసా నిధులనైనా తెలంగాణకు తెప్పించడం చేత కాని రాష్ట్ర బీజేపీ నేతలు అధికారం గురించి కలలు కంటున్నారు అని కాలేరు విమర్శించారు.బీజేపీ నేతలకు దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించాలి.తెలంగాణకు ఉపయోగపడే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు తెస్తే తప్ప బీజేపీ నేతలను ఎవరూ నమ్మరు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో జరుగుతున్నట్టుగా సంక్షేమం అమలవుతోందా ? అని ప్రశ్నించారు.సీఎం కేసీఆర్,కేటీఆర్ల మీద లక్ష్మణ్ అనవసరం గా నోరు పారేసు కోవద్దని కాలేరు వెంకటేష్ అన్నారు.
ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ…దేశంలో కెసిఆర్ లాంటి ముందు చూపు ఉన్న నేత మరొకరు లేరు…దేశంలో అనేక నగరాల్లో తాగునీటి సమస్య ఉన్నా హైదరాబాద్లో తాగునీటి సమస్య లేక పోవడం కేసీఆర్ చలవే అని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు.తెలంగాణ అభివృద్ధి ,సంక్షేమ పథకాల పై లక్ష్మణ్ తో చర్చకు సిద్దమే.. గాలి మాటలు మాట్లాడి ఇష్టమొచ్చినట్టుగా కేసీఆర్,కేటీఆర్ లను విమర్శిస్తే బీజేపీ తెలంగాణలో బలపడడదని లక్ష్మణ్ గ్రహించాలి అని ఎమ్మెల్యే తెలిపారు.